అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి
- మండలానికి బీటీ రోడ్డు, గ్రామపంచాయతి భవనం మంజూరుపై హర్షం
- ఎమ్మెల్యే కసిరెడ్డికి ఘన సన్మానం
తలకొండపల్లి, జూలై 17 (విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గ సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధే తన ముఖ్య ధ్యేయమని కల్వకుర్తి ఎమ్మెల్యే శ్రీ కసిరెడ్డి నారాయణరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో కడ్తాల, తలకొండపల్లి, కల్వకుర్తి మండలాల లబ్ధిదారులకు ముఖ్య నాయకుల సమక్షంలో ఆయన సీఎం సహాయనిధి చెక్కులు, ఎల్‌ఓసీ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా తలకొండపల్లి మండలం వెంకట్రావుపేట గ్రామానికి బీటీ రోడ్డు, నూతన గ్రామపంచాయతీ భవనం మంజూరు చేయించినందుకు గాను స్థానిక నాయకులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ పరిధిలో నూతన గ్రామపంచాయతీల ఏర్పాటుకు కృషి చేసినందుకు పలువురు ముఖ్య నేతలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో కల్వకుర్తిని ప్రగతి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లేలా కాంగ్రెస్ శ్రేణులు చొరవ చూపాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నేత,మాజీ ఎంపీపీ రఘురాములు, మండల నాయకులు పాల్గొన్నారు.






