వాహన తనిఖీల్లో పోలీసుల విధులకు ఆటంకం
నలుగురిపై కేసు నమోదు: ఎస్సై భార్గవ్ గౌడ్
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం...గాంధారి మండలం యాచారం తాండకు చెందిన వినయ్, భీంగల్ చెందిన సచిన్, నిజాంబాద్‌కు చెందిన కళ్యాణ్,డిచ్‌పల్లి మండలం గన్నారం గ్రామానికి చెందిన మాలావత్ నితిన్ ఎల్లారెడ్డి నుంచి మెదక్ వైపు కారులో ప్రయాణిస్తుండగా, నాగిరెడ్డిపేట మండలంలో పోలీసులు నిర్వహిస్తున్న వాహనల తనిఖీల్లో భాగంగా వాహనాలు ఆపమని సంకేతాలు ఇచ్చారు.
కారులో ప్రయాణిస్తున్న ఆనలుగురు వ్యక్తులు వాహనాన్ని ఆపకుండా విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందిని ఢీకొట్టేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు.అనంతరం పోలీసు సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తూ, వీడియోలు తీశారని, పోలీసు శాఖకు చెందిన ట్యాబ్‌ను నేలకేసి కొట్టి ధ్వంసం చేశారని పేర్కొన్నారు. అలాగే విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించినట్లు తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం తదితర సంబంధిత నేరాల కింద నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ వెల్లడించారు.






