కాంగ్రెస్‌కు వసుపుల దూరం..!
- ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డిలకు దశాబ్ద కాలంగా వెన్నుదన్నుగా నిలిచిన సీనియర్ నేత
- రక్తం చెమటోడ్చిన వారికి మొండిచేయి..
- నిన్నొచ్చిన జూనియర్ల హవాపై గుర్రు..
- పదవుల పంపకాల్లో వివక్షే కారణమా?
- ఆమనగల్లు పాలిటిక్స్‌లో హాట్ టాపిక్..!
ఆమనగల్లు, జూలై 17 (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వినూత్న పాలన సాగిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం రక్తం చెమటోడ్చిన సీనియర్ నాయకులకు, కష్టపడ్డ కార ్యకర్తలకు మాత్రం తగిన గుర్తింపు దక్కడం లేదనే అసంతృప్తి రోజురోజుకూ ముదురుతోంది.
ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా, కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పు డు ఇదే అత్యంత హాట్ టాపిక్గా మారింది. ఆమనగల్ మున్సిపాలిటీకి చెందిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్, సీనియర్ దళిత నేత వసుపుల జంగయ్య గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు ‘దూరం దూ రం’గా ఉంటుండడం నియోజకవర్గ వ్యాప్తం గా తీవ్ర చర్చనీయాంశమైంది.
దశాబ్ద కాలపు నమ్మకానికి దక్కిన బహుమతి ఇదేనా?
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించడంలోనూ, స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి గెలుపులోనూ వసుపుల జంగయ్య క్రియాశీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి 2014 నుండి, అంటే దాదాపు 12 ఏళ్లుగా అత్యంత నమ్మకమైన, ముఖ్య అనుచరుడిగా జంగయ్యకు రాజకీయ ముద్ర ఉంది.
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గెలుపు కోసం శ్రమించిన సీనియర్ నేతలకు సముచిత స్థానం కల్పిస్తామని నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి హామీ ఇచ్చినప్పటికీ.. అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. దీంతో జంగయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అలక వల్లే ఇటీవల జరిగిన ఆమనగల్లు మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం ఆయన అంటీముట్టనట్లుగా వ్యవహరించడం కాంగ్రెస్ శ్రేణులను విస్మయానికి గురిచేసింది.
చైర్మన్ హామీ ఇచ్చినా తగ్గని నైరాశ్యం..
నిజానికి ఆమనగల్లు మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవాలని, మున్సిపల్ చైర్మన్ పదవికి సంబంధించి ఎమ్మెల్యే కసిరెడ్డి స్వయంగా హామీ ఇచ్చినప్పటికీ జంగయ్య ఆ ఎన్నికలకు దూరంగానే ఉండిపోయారు. ఎన్నికల ముందు మున్సిపల్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో, పార్టీలో చేరికల విషయంలో జరిగిన తీవ్ర సమన్వయ లోపం, ఏకపక్ష నిర్ణయాల కారణంగానే ఆయన తీవ్ర మనస్థాపానికి గురైనట్లు సమాచారం.
‘రాజకీయాల్లో కనీసం గ్రామంలో సర్పంచ్గా కూడా గెలవలేని జూనియర్ నాయకులు నేడు నియోజకవర్గ ఇన్చార్జులుగా చలామణి అవుతున్నారు. అలాంటి వారికే పార్టీ పెద్దలు పెద్దపీట వేస్తున్నారు. కానీ 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ, పార్టీని, నాయకులను నమ్ముకుని ఉన్న మా లాంటి వాళ్లం పదవులకు సరిపోమా?‘ అని అసంతృప్తితో ఉన్న ద్వితీయ శ్రేణి నేతలు లోలోపల మదనపడుతున్నారు.
కార్పొరేషన్ పదవులపైనే ఆశలు.. అధిష్టానం స్పందిస్తుందా..?
కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో మాదిగ సామాజిక వర్గంలో రాజకీయంగా ఎంతో క్రియాశీలకమైన నాయకుడిగా వసుపులకు బలమైన పట్టు ఉంది. కాంగ్రెస్ పార్టీలో గతంలో ఆయన ఆమనగల్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ డీసీసీ ఉపాధ్యక్షుడిగా రెండుసార్లు పదవులు చేపట్టి పార్టీ బలోపేతానికి కృషి చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీసీసీ సభ్యుడిగానూ, ఎస్సీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్గానూ సేవలందించి పార్టీ అధిష్ఠానం వద్ద ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మాజీ కేంద్రమంత్రి దివంగత సూదిని జైపాల్ రెడ్డిని మొదలుకొని, మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, దివంగత మాజీ ఎంపీ మంద జగన్నాథ్లతో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి.
నియోజకవర్గంలోని సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న కార్పొరేషన్ పదవుల్లో వసుపుల జంగయ్యకు చోటు కల్పిస్తేనే.. భవిష్యత్తులో పార్టీకి, తాము నమ్ముకున్న నాయకుడికి కొండంత అండగా ఉంటామని జంగయ్య వర్గీయులు స్పష్టం చేస్తున్నారు.
పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, నమ్ముకున్న నాయకుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ఆశించిన పదవులు దక్కితేనే పార్టీ భవిష్యత్తు బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.మరి ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిలు స్పందించి ఈ సీనియర్ నాయకుడి అసంతృప్తిని చల్లారుస్తారా? లేక నిర్లక్ష్యం చేసి పార్టీ చేజేతులా నష్టపోతుందా? అనేది వేచి చూడాలి.






