4 September, 2026 | 7:16 AM

లండన్‌కు 86 టన్నుల పసిడి

04-09-2026 | 06:00am

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో భద్రపరిచిన నెదర్లాండ్

అమెరికా అనిశ్చితుల నేపథ్యంలో నిర్ణయం

ది హేగ్/ఆమ్‌స్టర్‌డ్యామ్, సెప్టెంబర్ 3: అంతర్జాతీయ ఆర్థిక అస్థిరతల నేపథ్యంలో తమ దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు, సంక్షోభ సమయంలో దేశ ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టుకునేందుకు నెదర్లాండ్(Netherlands) నిర్ణయించింది. ఇందులో భాగంగా తమ బంగారు నిల్వలలో బిలియన్ల డాలర్ల విలువైన బంగారాన్ని ఉత్తర అమెరికా నుంచి తరలించినట్లు డచ్ సెంట్రల్ బ్యాంక్(Dutch Central Bank) బుధవారం ప్రకటించింది.

న్యూయార్క్, కెనడాలోని ఒట్టావాలో ఉన్న మొత్తం సుమారు 313 మెట్రిక్ టన్నుల (345 టన్నులు) బంగారం నిల్వల నుంచి, మార్చి, ఆగస్టు మధ్య కాలంలో సుమారు 86 మెట్రిక్ టన్నుల (94.8 టన్నులు) బంగారాన్ని లండన్‌కు తరలించినట్లు బ్యాంక్ తెలిపింది. ఈ తరలింపునకు ముందు, డచ్ బంగారం నిల్వలలో 31.3 శాతం న్యూయార్క్‌లోనూ, 19.7 శాతం ఒట్టావాలోనూ ఉండేవి. తరలింపు తర్వాత, ఇప్పుడు ఈ రెండు నగరాల్లోనూ చెరో 18.5 శాతం నిల్వలు ఉన్నాయని బ్యాంక్ పేర్కొంది.

ఈ బ్యాంక్ వద్ద మొత్తం 612.4 మెట్రిక్ టన్నుల (675 టన్నులు) బంగారం ఉంది. 2025 చివరి నాటికి దీని విలువ 72.2 బిలియన్ యూరోలు (సుమారు 83.6 బిలియన్ అమెరికన్ డాలర్లు)గా ఉంది. ‘ఈ తరలింపుతో, మేము మా బంగారు నిల్వల వాణిజ్య సామర్థ్యాన్ని మెరుగుపరిచాం’ అని బ్యాంక్ గవర్నర్ ఓలాఫ్ స్లీజ్పెన్ ఒక లిఖితపూర్వక ప్రకటనలో తెలిపారు. ‘వాటిని ఉపయోగించాల్సిన అవసరం ఎప్పటికీ రాదని మేము ఆశిస్తున్నాం, కానీ మా సంసిద్ధతను, క్లిష్ట పరిస్థితులను తట్టుకునే సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడం అవసరం’ అని స్పష్టంచేశారు.

అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా బంగారు కడ్డీలను సరిగ్గా ఎలా తరలించారనే వివరాలను వెల్లడించకుండానే, అమెరికా, కెనడా నుంచి జైస్ట్  పట్టణానికి సమీపంలోని సైనిక స్థావరంలో ఉన్న అత్యంత భద్రత కలిగిన తమ వాల్ట్‌కు (భద్రతా గదికి) 30 టన్నుల కంటే ఎక్కువ బంగారాన్ని  తరలించినట్లు బ్యాంక్ తెలిపింది. జైస్ట్ నుంచి లండన్‌కు కూడా దాదాపు అంతే పరిమాణంలో బంగారం తరలించామని తెలిపింది. మిగిలిన తరలింపు ప్రక్రియలో భాగంగా, న్యూయార్క్‌లో సుమారు 65 టన్నుల బంగారాన్ని విక్రయించి, ఆ వచ్చిన మొత్తంతో లండన్‌లో బంగారాన్ని కొనుగోలు చేశారు.

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లోనైతే క్లిష్ట సమయంలో తాకట్టుపెట్టడం, కొనుగోలు, అమ్మకాలు జరపడం సులభమని, సురక్షితమని ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని పలు దేశాలు, ప్రముఖులు ఇక్కడ దాస్తుంటారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌ను శత్రుదుర్భుద్యంగా కూడా అభివర్ణిస్తుంటారు. ఈ బ్యాంకులో ఉన్న బంగారం నిల్వలు 90 శాతానికి పైగా 30 దేశాలకు చెందినవి. లండన్‌కు చెందిన బంగారం కేవలం 6 శాతం మాత్రమే కావడం గమనార్హం.