సిగ్గులేని ప్రభుత్వం!
- ఫీజు బకాయిల కోసం విద్యార్థుల పక్షాన దీక్షలు, లేఖలు
- 8 లక్షల మంది విద్యార్థుల సంతకాలు సేకరణ
- అయినా ప్రభుత్వంలో చలనం లేదు
- బలిపీఠంపై 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు
- కాంగ్రెస్ సర్కార్ ఇకనైనా కళ్లు తెరవాలి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
- సచివాలయం ఆకస్మిక ముట్టడి, ముఖ్య నేతల అరెస్టు
- రాంచందర్‌రావును చిక్కడపల్లి పీఎస్‌కు తరలింపు
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి) : ‘ఫీజు రీయింబర్స్‌మెంట్(fee reimbursement) బకాయిలు విడుదల చేయాలని నిరాహార దీక్ష(hunger strike) చేశా, సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy)కి లేఖలు రాశా, 8 లక్షల మంది విద్యార్థుల సంతకాలు సేకరించి వినతిపత్రాలు అందజేశాం.అయినా ఈ సిగ్గులేని ప్రభుత్వం ఇసుమంతైనా చలించలేదు’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు(N. Ramchander Rao) మండిపడ్డారు. రూ.15,000 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల(students) భవిష్యత్తు బలిపీఠంపై ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉన్నత చదువులు(Higher education), ఉద్యోగ అవకాశాలకు(job opportunities) దూరమవుతున్నారని.. ఇది కాంగ్రెస్ సర్కార్(Congress government) అహంకారానికి, విద్యార్థి వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. విద్యార్థుల సహనం నశించడంతోనే వారి గొంతుకగా మారి నేరుగా సచివాలయానికి వెళ్లాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మందికి పైగా విద్యార్థుల నుంచి సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రాలను ప్రభుత్వానికి సమర్పించేందుకు గురువారం బీజేపీ ఆధ్వర్యంలో రాంచందర్‌రావు నేతృత్వంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంపీ డీకే అరుణ, బీజేవైఎం అధ్యక్షుడు గణేష్ కుండే, బండారు విజయలక్ష్మితదితరులు ఆకస్మిక పాదయాత్ర చేపట్టి సచివాలయం ముట్టడించారు.
ఈ సందర్భంగా బీజేవైఎం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సచివాలయం గేట్ ఎక్కడానికి ప్రయత్నించగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే బైఠాయించి విద్యార్థులు రాసిన 8 లక్షల లేఖలను సచివాలయం ప్రధాన గేట్ వద్ద కుప్పలుగా పోసి నిరసన తెలిపారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. పలువురు కీలక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తన అక్రమ అరెస్ట్‌పై రామచందర్‌రావు తీవ్రంగా స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అరెస్ట్ చేసింది నన్ను కాదని.. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం నిరీక్షిస్తున్న 40 లక్షల మంది విద్యార్థుల గొంతుకలను అని మండిపడ్డారు. నన్ను నిర్బంధించగలరేమో గానీ, 40 లక్షల మంది విద్యార్థుల ఆక్రందన, ఆగ్రహాన్ని మాత్రం ఆపలేరని స్పష్టం చేశారు. తెలంగాణ విద్యార్థులకు అందాల్సిన ప్రతి పైసా విడుదలయ్యేంత వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.
విద్యార్థుల పక్షాన నినదిస్తే అరెస్టులా? : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రాష్ట్రంలోని లక్షలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్న ఈ ప్రభుత్వం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అడిగితే పోలీసులతో అణచివేసే ప్రయత్నం చేయడం అత్యంత హేయమైన చర్య అని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ తీరు రాష్ట్రంలో రాక్షస, నియంతృత్వ పాలనకు పరాకాష్టగా మారిందన్నారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం సీఎంను అపాయింట్‌మెంట్ అడిగితే కనీసం స్పందించే తీరిక లేకపోవడం ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే మొండి వైఖరిని వీడి రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థుల పక్షాన పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
సీఎం రాజీనామా చేయాలి: ఎంపీ డీకే అరుణ
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలని వినతిపత్రం అందజేసేందుకు వెళ్తే అడ్డుకోవడం దుర్మార్గమని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. వెంటనే పీజు బకాయిలు విడుదల చేయకపోతే సీఎం రేవంత్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు.
కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్‌లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు నిరుద్యోగులుగా మిగులుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు బకాయి పడాయి పేరుతో విద్యార్థుల పక్షాన బీజేపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని హెచ్చరించారు.






