4 September, 2026 | 7:35 AM

డేంజర్ వెల్స్

04-09-2026 | 06:05am

రోడ్డు పక్కన ప్రమాదకరంగా బావులు

రక్షణ గోడలు లేక తరచూ ప్రమాదాలు

సుందరగిరి బస్సు ప్రమాదంతో ఉలికిపాటు

కరీంనగర్, సెప్టెంబరు 3 (విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావుల వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు(Road accidents) జరుగుతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి  గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన  ఉన్న వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో బస్సు ముందరి భాగం బావి రక్షణ గోడను ఢీకొట్టి గాల్లో వేలాడగా,  డ్రైవర్ సమయస్ఫూర్తితో బ్రేకులు వేయడం వల్ల  ప్రమాదం తప్పింది. చాలా ప్రాంతాల్లో ప్రధాన రహదారులకు అతి సమీపంలోనే లోతైన వ్యవసాయ బావులు ఉన్నాయి. వీటికి కనీస రక్షణ గోడలు, ఫెన్సింగ్ లేకపోవడంతో వాహనాలు నేరుగా బావుల్లోకి దూసుకెళ్తున్నాయి.

మలుపులు, ఇరుకైన రోడ్లు, రోడ్ల విస్తరణ సరిగ్గా లేకపోవడం, హెచ్చరిక బోర్డులు లేకపోవడంవల్ల రాత్రి వేళల్లో వాహనదారులు బావులను గుర్తించలేకపోతున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగులో 23 ఏళ్ళ క్రితం జరిగిన ఘటన నేటికి ప్రజలు మరిచి పోలేదు . ఉమ్మడి జిల్లా చరిత్రలోనే అత్యంత విషాదకరమైన సంఘటన ఇది.

దేశరాజుపల్లి గ్రామంలో విద్యార్థులతో వెళ్తున్న ఒక స్కూల్ వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 8 మంది పాఠశాల విద్యార్థులతో పాటు వ్యాన్ డ్రైవర్ కూడా మరణించారు. అప్పటి ఉమ్మడి రాష్ట్ర  సిఎంగా ఉన్న ఏపి సిఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు కూడా. ఇలాంటి ప్రమాదాలు ఇటీవల కాలంలో పెరిగి పోయాయి. 

జూలై 2021న చిన్న ముల్కనూరు కారు ప్రమాదం  జరిగింది. గ్రామ శివారులో ఒక కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి పక్కనే ఉన్న 60 అడుగుల లోతైన వ్యవసాయ బావిలో పడిపోయింది.  ఈ ఘటనలో ఒక విశ్రాంత పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్   మరణించారు.  జనవరి 2026లో కరీంనగర్ జిల్లా వేగురుపల్లి సమీపంలో ఒక కారు అదుపుతప్పి 50 అడుగుల లోతున్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

ఆగస్టు 27, 2026 న కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలానికి చెందిన ఒకే కుటుంబం ప్రయాణిస్తున్న కారు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మంగళపల్లి శివారులో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఎండిపోయిన వ్యవసాయ బావిలో పడింది. ఈ ఘటనలో ఒక వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.  ఇన్ని ప్రమాదాలు జరుగుతున్న ప్రభుత్వం కానీ, అధికారులు కానీ స్పందించడం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ప్రమాదకరంగా మారిన రోడ్డు పక్కన ఉన్న బావులను గుర్తించి, వాటిని పూడ్చివేయాలని లేదా వాటి చుట్టూ బలమైన సిమెంట్ రక్షణ గోడలు, క్రాష్ బారియర్స్ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు, ప్రయాణికులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.