రూ.300కు యూరియా బస్తా!
- కలెక్టర్‌కు రైతుల ఫిర్యాదు
- ఎరువుల దుకాణాలు సీజ్ చేసిన తహసీల్దార్
కొల్చారం, మార్చి 9: యూరియా బస్తాను రూ.266 అమ్ముతున్నట్లు రసీదులో నమోదు చేస్తూ రూ.300 కు విక్రయిస్తున్నారని మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజీపల్లి గ్రామానికి చెందిన రైతులు సోమవారం కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్‌కు తమ గ్రామంలోనే ఫిర్యాదు చేశారు.
మండలంలోని రంగంపేట, దుంపలకుంటలోని ఎరువుల దుకాణాలకు గత రెండు రోజుల క్రితం యూరియా సరఫరా కాగా రూ.300 బస్తా చొప్పున యూరియా విక్రయించారని, ఈ విషయమై మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఫిర్యాదు చేశారు. ఏదైనా సమస్యపై మండల వ్యవసాయ అధికారి కార్యాలయానికి వెళ్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
స్పందించిన కలెక్టర్ సంబంధిత ఎరువుల దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని డీఏవో దేవకుమార్‌ను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కొల్చారం తహసిల్దార్ శ్రీనివాసచారి, మండల వ్యవసాయ అధికారి శ్వేత కుమారి రంగంపేటలోని అజయ్ కుమార్ ఫర్టిలైజర్స్, సాయిరాం ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. యూరియా బస్తా రూ.300 లకు విక్రయించినట్లు విచారలో తేలడంతో ఆ దుకాణాలను సీజ్ చేశారు.




