ప్రజారోగ్యానికి పెద్ద పీట
- ప్రజాపాలనలో ఆరోగ్యంపై స్పెషల్ ఫోకస్
- దేశంలోనే అత్యధిక మెడికల్ కళాశాలలు
- ట్రాన్స్‌జెండర్ల వైద్యం కోసం ప్రత్యేక క్లినిక్స్
- వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాల జాతర
హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖలో ఎప్పుడు లేనంతగా ప్రగతి కనిపిస్తోంది. ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధిగా వ్యవహరిస్తూ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల పెంపుతో పాటు నూతన నియామకాలు చేపడుతూ ముందుకు సాగుతోంది.
సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజారోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ గతంలో ఎన్నడూ లేనివిధంగా నిధుల కేటాయించారు. తొలి ఏడాదిలోనే వైద్యారోగ్య శాఖలో నియామకాలు, కొత్త వైద్య, నర్సింగ్, పారా మెడికల్ కాలేజీల మంజూరు, సీట్లు, పడకలపెంచారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డుల జారీ పైలెట్ ప్రాజెక్టును చేపట్టారు.
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి దేశంలోనే అత్యధిక ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారు.
సంతానం లేని మహిళల కోసం రాష్ట్రంలో తొలిసారిగా ఐవీఎఫ్ సెంటర్‌ను గాంధీ ఆసుపత్రిలో ప్రారంభించారు. ట్రాన్స్‌జెండర్ల కోసం రాష్ట్రంలో ఒకేసారి 32 జిల్లాల్లో ప్రత్యేక క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ సర్కారు ఏడాదిలో రూ. 830 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ నిధులు విడుదల చేసి రికార్డు సృష్టించిందంటే ప్రజారోగ్యంపై ఈ సర్కారుకున్న అంకితభావం అర్థం అవుతుంది.
రాజీవ్ ఆరోగ్య శ్రీ
రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద గత పదేళ్లలో అప్పటి ప్రభుత్వం నెలకు సగటున రూ.52 కోట్లు ఖర్చు చేస్తే.. కాంగ్రెస్ సర్కారు గత ఏడాదిలో నెలకు రూ.76 కోట్ల చొప్పున వ్యయం చేసింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే 1,375 వైద్య చికిత్సల ధరలను 20 శాతం వరకు పెంచింది. కొత్తగా 163 రకాల చికిత్సలను చేర్చింది.
కొలువుల జాతర
ప్రజా ప్రభుత్వం ఆరోగ్యశాఖలో 7,774 పోస్టులను భర్తీ చేసింది. ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ ద్వారా మరో 6,470 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మరో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 1,690 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టులు, 308 ఫార్మసిస్ట్ (ఆయుష్) పోస్టుల భర్తీకి త్వరలోనే ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ నోటిఫికేషన్లు ఇవ్వనున్నది. జూనియర్ డాక్టర్లకు సంబంధించిన స్టుఫైండ్ చెల్లింపులు, పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించింది.
అధునాతనంగా కొత్త ఉస్మానియా
తెలంగాణకు తలమానికమైన ఉస్మానియా హాస్పిటల్ కు గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. గోషామహల్‌లో సుమారు 32 ఎకరాల విస్తీర్ణంలో రూ.2 వేల కోట్లతో కొత్త దవాఖాన నిర్మించాలని నిర్ణయించింది. పోలీస్ శాఖ నుంచి ఆరోగ్యశాఖకు భూ బదలాయింపు ప్రక్రియ కూడా పూర్తయింది. ప్రజాప్ర భుత్వం ఏర్పడ్డాక రాష్ర్టంలో కొత్తగా 16 డయాలసిస్ సెంటర్లను మంజూరు చేసింది.
ఇప్పటికే అందుబాటులో ఉన్న 20 డయాలసిస్ సెంటర్లలో అదనంగా 89 డయాలసిస్ మిషన్లను పేషెంట్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. నిమ్స్, గాంధీ, ఉస్మానియా, వరంగల్‌లోని ఎంజీఎం, ఖమ్మం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, మహబూబ్‌నగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్‌లో వాస్క్యులర్ సెంటర్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది.
మైత్రీ క్లినిక్స్
ట్రాన్స్‌జెండర్ల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా మైత్రి క్లినిక్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఉస్మానియా హాస్పిటల్‌లో ఇప్పటికే క్లినిక్ అందుబాటులో ఉండగా, మిగిలిన 32 జిల్లా ల్లో సోమవారం ప్రారంభించనున్నారు.
కొత్త మెడికల్ కాలేజీలు
రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 8 నెలలలోనే 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ములుగు, గద్వాల్, నర్సంపేట్, నారాయణపేట్, మెదక్, కుత్బుల్లాపూర్, మహేశ్వరం, యాదాద్రిలో కాలేజీలు, హాస్పిటళ్లను ఏర్పాటు చేసింది. ఒక్కో కాలేజీలో 50 సీట్ల చొప్పున, మొత్తం 400 ఎంబీబీఎస్ సీట్లును అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 3,690 నుంచి 4,090కి పెరిగింది.
ప్రజారోగ్యమే మాకు ముఖ్యం
ప్రజారోగ్యమే మాకు ముఖ్యం. అందుకే వైద్య ఆరోగ్య శాఖలో ఎప్పుడు లేని విధంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాం. ప్రజలకు సరైన వైద్యం అందడానికి ఇప్పటికే 7,774 పోస్టులను భర్తీ చేశాం. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా మరో 6,470 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశాం. ప్ర స్తుతం ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ట్రాన్స్‌జెండర్లకు సైతం ప్రత్యేకంగా మైత్రీ క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నాం. వైద్య, ఆరోగ్య రంగంలో దేశానికే ఆదర్శంగా నిలవాలనే తాపత్రయంతో మా ప్రభుత్వం పనిచేస్తోంది.
దామోదర రాజనర్సింహ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి




