6 April, 2026 | 2:53 PM

అక్రమాల అనకొండ నిఖేశ్

02-12-2024 02:43 AM
  1. తవ్వుతున్నకొద్దీ వెలుగులోకి అక్రమాలు
  2. ఉన్నతాధికారుల పాత్రపైనా ఏసీబీ ఆరా 
  3. 14 రోజుల రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్1(విజయక్రాంతి)/రాజేంద్రనగర్: ఇరిగేషన్ శాఖలో సస్పెన్షన్‌కు గురైన ఏఈఈ నిఖేశ్ కుమార్ అక్రమాల చిట్టా తవ్వుతున్న కొద్దీ బయటపడుతూనే ఉంది. ఏఈఈ స్థాయిలోనే ఇంత పెద్దఎత్తున అక్రమాస్తులు కూడబెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

రంగారెడ్డి జిల్లా గండిపేటలో ఏఈఈగా పనిచేసిన సమయంలో ఈ అక్రమాస్తులను పోగేసినట్టుగా తెలుస్తోంది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలకు అనుమతి ఇచ్చేందుకు పెద్ద మొత్తంలో లంచం తీసుకున్నట్టు సమాచారం. ఏఈఈ నిఖేశ్ కుమార్ నివసించే పెబెల్ సిటీపై కూడా వివాదాలున్నట్టు తెలుస్తోంది.

ఈ పెబెల్ సిటీలో డిజు ఫ్లాట్ నంబరు 1085 కూడా లంచంగానే సొంతం చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఏఈఈ స్థాయిలో వందల కోట్లు కూడ బెట్టడంతో ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద భారీ తిమింగలంగా ఏఈఈ నిఖేశ్ కుమార్‌ను ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అతని వెనుకాల ఉన్నతాధికారుల పాత్ర ఏమేరకు ఉందా? అనే కోణంలోనూ ఏసీబీ పరిశీలిస్తుంది.

శనివారం మొత్తం 20 చోట్ల జరిపిన సోదాలలో రూ.200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. నిఖేశ్‌కుమార్‌ను శనివారం రాత్రి అదుపులోకి తీసుకోగా, ఆదివారం ఉదయం ఏసీబీ న్యాయస్థానంలో జడ్జి ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో నిఖేశ్ కుమార్‌ను ఏసీబీ అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. 

తానుండే ఫ్లాట్ కూడా లంచమే 

ఇరిగేషన్ శాఖలో ఏఈఈ నిఖేశ్ కుమార్ అక్రమాస్తులు అసాధారణ స్థాయిలో కూడబెట్టడంతో సంచలనాత్మకంగా మారింది. రెండో దఫా ఏసీబీ అధికారుల దాడుల్లో బయటపడ్డ అక్రమాస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులే నివ్వెరపోతున్నారు.

గత మే 30న రెడ్ హిల్స్‌లోని రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ కార్యాలయంలో ఈఈ బన్సీలాల్, ఏఈ కార్తీక్ లంచంగా పొందిన డబ్బులో తన వాటా కోసం వెళ్లి ఏసీబీ వలలో చిక్కిన నిఖేశ్‌కుమార్ చిట్టాను కనుగొనడానికి అధికారులకు 6 నెలల సమయం పట్టినట్టు తెలుస్తోంది.

చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేసే వారికి ఒక్కో ఎన్వోసీ అనుమతి కోసం రూ.50 లక్షలకు తక్కువ కాకుండా లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో అత్యంత సన్నిహితంగా ఉండేవాడని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే పీరంచెరువు సమీపంలోని తాను నివసించే పెబెల్‌సిటీ కూడా వివాదస్పదం కావడంతో డిఝు 1085 ఫ్లాట్‌ను లంచంగా పొందినట్టు అధికారులు భావిస్తున్నారు. ఇలా 2021 నుంచి గండిపేటలో ఏఈఈ గా విధులు నిర్వహించిన నిఖేశ్ కుమార్ ప్రతి రోజూ గోల్డ్‌న్ స్పూన్ జీవితాన్ని అనుభవించినట్టు ఏసీబీ గుర్తించింది. 

అక్రమాస్తుల చిట్టా ఇదీ

సాధారణంగా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) స్థాయి అధికారి జారీచేయాల్సిన ఎన్వోసీకి ఓ ధరను నిర్ణయించి మరీ నిబంధనలకు విరుద్ధంగా అవినీతి మార్గంలో సొమ్మును విపరీతంగా వసూలు చేసినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. 200 గజాలకు ఎన్వోసీ జారీకి రూ.4 లక్షలు, రెండు ఎకరాలకు మించి నిర్మాణాలు చేపడితే రూ.50 లక్షల చొప్పున వసూలు చేసినట్టు తెలుస్తోంది.

నాలుగేళ్ల కాలంలో ఏఈఈ నిఖేశ్‌కుమార్ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. అత్యంత ఖరీదైన పెబెల్‌సిటీలో నివాసం ఉండే నిఖేశ్ కుమార్‌కు 5 ఇండ్ల స్థలాలు, 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, 6 ప్లాట్స్, 2 కమర్షియల్ స్థలాలు, 3 కార్లు ఉన్నట్టుగా అధికారులు గుర్తించి, విలువై న పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

వీటిలో మియాపూర్, శంషాబాద్‌లోని కపిల్ ఇన్‌ఫ్రా, మైరాన్ ఇన్ ఫ్రాలో ఉన్న కమర్షియల్ స్థలాలే కోట్లాది రూపాయల విలువ చేస్తాయని అంచనా. నిఖేశ్‌కుమార్‌కు మూడు కార్లు ఉన్నాయి. కొల్లూరులో 15 ఎకరాల వ్యవసాయ భూమి, మొయినాబాద్‌లో మూడు ఫామ్‌హౌస్‌లు, విలాసవతంమైన విల్లాలు, ఎస్బీఐలోని కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్, పెద్ద మొత్తంలో ఆర్‌టీజీఎస్‌లు చేసినట్టుగా తెలుస్తుంది.

నిఖేశ్‌కుమార్ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను ఏసీబీ అధికారులు లోతుగా పరిశీస్తుండగా, సోమవారం బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేసే అవకాశం ఉంది. 20 ప్రాంతాల్లో ఏసీబీ జరిపిన సోదాలలో లభిం చిన ఆస్తుల విలువ అధికారికంగా రూ.17.73 కోట్లు ఉన్నట్టు వెల్లడించగా, మార్కెట్ రేటు ప్రకారం దాదాపు రూ. 200 కోట్ల పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

డబ్బులు కొట్టు.. ఎన్వోసీలు పట్టు 

గండిపేట మండలం కోకాపేటలో ప్రస్తుతం గజం స్థలం సుమారు రూ.2 లక్షలు పలుకుతోంది. నార్సింగి, మణికొండ ఏరియాల్లో లక్షకు పైగా మార్కెట్‌లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంపై బడా బిల్డర్లు కన్నేశారు. చెరువులు, జలాశయాల పక్కన కొంత భూమి కొనుగోలు చేసి మరికొంత కబ్జాలకు పాల్పడ్డారు. వీరికి ఏఈఈ నిఖేశ్ వెన్నుదన్నుగా నిలిచారు.

భారీగా డబ్బులు దండుకొని వారికి ఎన్వోసీలు జారీచేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మణికొండ మున్సిపాలిటీలో ప్రవహించే బుల్కాపూర్ నాలా ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల ఉదాసీనత కారణంగానే కబ్జాకు గురై ఆనవాళ్లు లేకుండా పోయింది. నాలుగేళ్ల కాలంలో ఏఈఈ నిఖేశ్ గండిపేటలో జారీచేసిన ఎన్వోసీలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తేనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని గండిపేట మండల వాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.