17 June, 2026 | 2:50 AM

ప్రభుత్వ విద్యలో సరికొత్త విప్లవం

17-06-2026 01:59 AM
  1. నేడే ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ప్రారంభం
  2. కార్పొరేట్ సంస్థలకు సవాల్ విసురుతున్న ‘ఆరుట్ల’ మోడల్ స్కూల్
  3. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నేడే గ్రాండ్ ఓపెనింగ్
  4. ఆరెకరాల క్యాంపస్.. నర్సరీ టు ఇంటర్.. డిజిటల్ క్లాస్ రూంలు
  5. అడ్మిషన్ల కోసం జనం క్యూ.. క్యూ n అప్పుడే ‘నో అడ్మిషన్’ బోర్డు!

రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం, జూన్ 16 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ విద్యా రంగంలో సరికొత్త శకానికి నాంది పడుతోంది. పైసా ఖర్చు లేకుండా.. పేద, మధ్య తరగతి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించేందుకు స ర్కారు సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాష్ట్రంలోనే మొట్టమొదటి ‘టీజీ పబ్లిక్ స్కూల్’ నేడు (జూన్ 17న) అధికారికంగా ప్రారంభం కానుంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విద్యాసంస్థను ప్రారంభించి, అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తూ, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు గట్టి పోటీ ఇచ్చేలా ఒకే గొడుగు కింద అన్ని వసతులను కల్పించి ఈ పైలట్ ప్రాజెక్ట్ను ప్రభుత్వం రూపుదిద్దింది. రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా రంగారెడ్డి జిల్లా ఆరుట్ల,నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు, కోడంగల్ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద తెలంగాణ పబ్లిక్ స్కూల్ లను నిర్మించ తలపెట్టింది. మొదలు ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ కు ప్రభుత్వం శ్రీకారం చుట్టానుంది.

ఐదు గ్రామాల స్కూళ్ల విలీనం.. 

 ఆరుట్ల పరిసర ప్రాంతాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేసి, సుమారు ఆరు ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో ఈ ఆధునిక విద్యా నిలయాన్ని నిర్మించారు. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన ఈ క్యాంపస్ విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని దూరం చేసేలా ఉంది.నాణ్యమైన విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్గా తీర్చిదిద్దడమే ఈ స్కూల్ ముఖ్య లక్ష్యం.

నర్సరీ నుంచి ఇంటర్ వరకు.. క్లాసుకో 40 మందే

ఈ పాఠశాల ప్రత్యేకతలు చూస్తే కార్పొరేట్ స్కూళ్లు కూడా దిగదూడుపే అనిపిస్తుంది.ప్రీ-ప్రైమరీ (నర్సరీ), ప్రైమరీ, హైస్కూల్, మరియు ఇంటర్మీడియట్ అనే 4 విభాగాలుగా దీనిని విభజించారు.విద్యా ప్రమాణాలు దెబ్బతినకుండా ఉండేందుకు ప్రతి తరగతికి రెండు సెక్షన్లు మాత్రమే ఉంటాయి. ఒక్కో సెక్షన్కు కేవలం 40 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంటుంది.ఈ మోడల్ స్కూల్లో సుమారు 1,700 నుండి 1,800 మంది విద్యార్థులు ఒకేసారి చదువుకునేలా మౌలిక వసతులు కల్పించారు.

స్కూల్ ప్రత్యేకతలు ఇవే..

డిజిటల్ క్లాస్ రూమ్స్:

పాఠశాలలోని ప్రతి తరగతి గదిలోనూ అత్యాధునిక డిజిటల్ బోధనా సౌకర్యాలు (స్మార్ట్ బోర్డులు) ఏర్పాటు చేశారు. సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లతో పాటు వేలాది పుస్తకాలతో కూడిన గ్రంథాలయాన్ని సిద్ధం చేశారు.

క్రీడలు & రవాణా: 

ఇండోర్, అవుట్డోర్ క్రీడా మైదానాలు ఉన్నాయి. సుదూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించారు.

క్రేజ్ మామూలుగా లేదు.. అప్పుడే ‘నో అడ్మిషన్’ బోర్డు

ఈ పాఠశాల మౌలిక వసతులు, ఉచిత కార్పొరేట్ విద్యపై నమ్మకంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు భారీగా తరలివచ్చారు. అడ్మిషన్ల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో.. స్కూల్ ప్రారంభానికి ముందే సీట్లన్నీ భర్తీ అయిపోయి, గేటు వద్ద ‘నో అడ్మిషన్’  బోర్డు పెట్టాల్సిన పరిస్థితి రావడం విశేషం.

స్థానికుల డిమాండ్:

అయితే, అడ్మిషన్ల విషయంలో ఆరుట్ల గ్రామంతో పాటు స్థానిక పరిసర ప్రాంతాల విద్యార్థులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక పిల్లల అవసరాలు తీరిన తర్వాతే ఇతరులకు అవకాశం ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఏర్పాట్లు పూర్తి చేశాం..

‘రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్ట్ పాఠశాల ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చేతుల మీదుగా ఇది ప్రారంభం కావడం గర్వకారణం. విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఉత్తమ బోధన అందించి, రాష్ట్రంలోనే ఈ స్కూల్కు టాప్ గుర్తింపు తెచ్చేందుకు మా ఉపాధ్యాయ బృందం అంకితభావంతో పనిచేస్తుంది. ‘రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థకు రోల్ మోడల్గా నిలవనున్న ఈ ’ఆరుట్ల’ ప్రయోగం ఎలాంటి ఫలితాలను ఇస్తుందోనని విద్యా రంగ నిపుణులు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు.

 రాములు, ప్రిన్సిపాల్