17 June, 2026 | 3:37 AM

ట్రావెల్స్ బస్సులో చోరీ కేసు ఛేదించిన ఖైరతాబాద్ పోలీసులు

17-06-2026 02:49 AM

ఖైరతాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దొంగతనం కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సంగారెడ్డి జిల్లాకు బస్సులో ప్రయాణిస్తున్న ఒక బాధితుడి హ్యాండ్బ్యాగ్ నుంచి సుమారు 62 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.

ఈ మేరకు రంగంలోకి దిగిన పంజాగుట్ట డివిజన్ ఇన్చార్జ్ ఏసిపి కె. సంజయ్ కుమార్ పర్యవేక్షణలో ఖైరతాబాద్ ఎస్హెచ్‌ఓ బి. వెంకట్ రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎమ్. బాలస్వామి నేతృత్వంలోని క్రైమ్ టీమ్ దర్యాప్తు చేపట్టింది. నిందితుడిని ఏపీలోని ప్రకాశం జిల్లా దర్శి గ్రామానికి చెందిన తాతపూడి తెల్ల రాజా అలియాస్ రాజు (48)గా గుర్తించి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన 62 గ్రాముల పూర్తి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో నిందితుడిపై గతంలో కూకట్పల్లి, పేట్ బషీరాబాద్, పంజాగుట్ట, ఎల్బీనగర్, సైఫాబాద్తో పాటు ఏపీలోని పలు స్టేషన్లలో దొంగతనం కేసులు ఉన్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రజలకు, ట్రావెల్స్ యాజమాన్యాలకు కీలక భద్రతా సూచనలు జారీ చేశారు. ప్రయాణికులు తమ విలువైన బంగారం, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులను ఎల్లప్పుడూ కంటిచూపు పరిధిలోనే ఉంచుకోవాలన్నారు.

లగేజ్ రాక్లలో నిర్లక్ష్యంగా వదిలేయకూడదని హెచ్చరించారు. బస్సు ఆపరేటర్లు తప్పనిసరిగా వాహనాల్లో, బోర్డింగ్ పాయింట్ల వద్ద సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రయాణికుల పూర్తి వివరాల రికార్డులను భద్రపరచాలని సూచించారు. మార్గమధ్యంలో ఐడెంటిటీ లేకుండా ఎవరినీ బస్సులోకి ఎక్కించుకోవద్దని, డ్రైవర్లు, సిబ్బంది అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రయాణికులకు క్రమం తప్పకుండా మైకుల్లో అవగాహన కల్పించాలన్నారు. కేసును విజయవంతంగా ఛేదించి సొత్తును రికవరీ చేసిన క్రైమ్ టీమ్ను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.