పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం
- శిథిలావస్థకు చేరుకున్న భవనం
- కాంప్లెక్స్ సమావేశాలకు తీవ్ర ఇబ్బందులు
బెజ్జూర్, జూన్ 16 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఆర్సీ) భవనం శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితుల్లో మండల విద్యాధికారి, సిబ్బంది, ఉపాధ్యాయులు భయాందోళనల మధ్య విధులు నిర్వహిస్తున్నారు. 2003 సంవత్సరంలో నిర్మించిన ఈ భవనానికి ఇప్పటివరకు సరైన మరమ్మతులు చేపట్టకపోవడంతో గోడలు పగుళ్లు ఏర్పడి, పైకప్పు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
మండలంలో జెడ్పీ సెకండరీ పాఠశాలలు 3, ఆశ్రమ పాఠశాలలు 4, ఎంపీపీఎస్ పాఠశాలలు 41, యూపీఎస్ పాఠశాలలు 5, ఐటిడిఏ పాఠశాలలు 27, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల 1, ప్రభుత్వ జూనియర్ కళాశాల 1 ఉన్నాయి. ఈ పాఠశాలలకు సంబంధించిన విద్యా కార్యక్రమాలు, సమీక్ష సమావేశాలు, ఉపాధ్యాయుల కాంప్లెక్స్ మీటింగ్లు ఎంఆర్సీ కేంద్రంలోనే నిర్వహిస్తుంటారు. అయితే భవనం దుస్థితి కారణంగా సమావేశాలు నిర్వహించడమే కష్టంగా మారిందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలంలో భవనం లోపలికి నీరు చేరి పాఠ్యపుస్తకాలు, కార్యాలయ రికార్డులు తడిసి పాడవుతున్నాయని మండల విద్యాధికారి సునీత తెలిపారు. కనీస సౌకర్యాలు లేక కార్యాలయానికి వచ్చే ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ప్రమాదకరంగా మారిన భవనానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని, లేకపోతే కొత్త భవనం నిర్మించాలని ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు.ఈ విషయమై జిల్లా విద్యాధికారి సచితానందను వివరణ కోరగా ఎమ్మార్సీ భవన పరిస్థితిపై నివేదికను జిల్లా కలెక్టర్కు పంపించి అవసరమైన చర్యలు తీసుకునేలా ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు.






