calender_icon.png 4 December, 2024 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడవి బిడ్డల కోసం కంటెయినర్ బడి

17-09-2024 05:26:05 AM

  1. రాష్ట్రంలోనే తొలి పాఠశాల 
  2. ములుగు కలెక్టర్ దివాకర వినూత్న ఆలోచన

హనుమకొండ, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): దట్టమైన అడవులకు నెలవైన ము లుగు ఏజెన్సీలో గుత్తికోయలకు చదువు అందని ద్రాక్షగా మారింది. ములుగు జిల్లా కలెక్టర్ వారి జీవితాల్లో వెలుగులు నింపాలని నిర్ణయించుకుని కంటెయినర్ పాఠశాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తొలి కంటెయినర్ పాఠశాలగా కన్నాయిగూడెం బడి రికార్డులకెక్కబోతోంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బంగారుపల్లి గుత్తికోయలు అటవీ ప్రాంతంలో నివాసముంటున్నారు. అక్కడ శాశ్వత నిర్మాణాలకు అటవీశాఖ అనుమతులు లేవు. గుత్తికోయలు చిన్నపాటి గుడారాలు ఏర్పాటు చేసు కుని నివాసముంటున్నారు. ఈ గుంపులోని పిల్లలు సౌకర్యవంతంగా లేని ఓ గుడిసెలో ఏర్పాటు చేసిన బడిలో చదువుకుంటున్నారు.

వారికి ఓ ఉపాధ్యాయురాలు, ప్రధా నోపాధ్యాయుడు విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. ఈ క్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర అక్కడి పరిస్థితులు తెలుసుకుని ఆదివాసీ పిల్లల కోసం నూతనంగా పాఠశాల నిర్మాణం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ అటవీశాఖ అనుమతులు ఇవ్వనందున వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. ఆ ప్రాంతంలో కంటెయినర్ పాఠశాల ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే తన నిధుల నుంచి రూ.13 లక్షలు మంజూరు చేసి కంటెయినర్ బడి నిర్మాణం ప్రారంభించారు. ఇప్పుడు తుది దశకు చేరుకుంది. ఈ కంటెయినర్ పాఠశాల 25 అడుగుల వెడ ల్పు, 25 అడుగుల పొడవు ఉంటుంది. 12 డ్యూయల్ డెస్క్‌లతో పాటు ప్రధానోపాధ్యాయుడు, టీచర్లు కూర్చోవడానికి 3 కుర్చీలు పట్టే స్థలం ఉంది. త్వరలో మంత్రి సీతక్క ఈ కంటెయినర్ బడిని ప్రారంభించనున్నారు. దీంతో కలెక్టర్ అన్ని వర్గాల ప్రశంసలు అందుకుంటున్నారు.