గ్రామ గ్రామాన ముదిరాజ్ జెండా… ఉగాది వేళ ఐక్యత గర్జన
నాగిరెడ్డిపేట్లో ఘన ఆవిష్కరణ సంప్రదాయాల నడుమ ఉగాది సంబరాల సందడి
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ముదిరాజ్ జాతి ఐక్యతకు ప్రతీకగా ప్రతీ సంవత్సరంలాగే ఈసంవత్సరం కూడా గ్రామ గ్రామాన జెండా ఎగురవేయాలన్న టిఎంఎంఎస్ తెలంగాణ ముదిరాజ్ మహాసభ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బట్టు విఠల్ ముదిరాజ్ పిలుపు ఎల్లారెడ్డిలో కార్యరూపం దాల్చింది. నాగిరెడ్డిపేట్ మండలంలోని తాండూర్,జానకంపల్లి, ఆత్మకూర్,జలాల్పూర్, మాల్తుమ్మెద,బొల్లారం, మాసానిపల్లి, మాటూర్,తదితర గ్రామంలో ముదిరాజ్ సంఘం నాయకులు, సభ్యులు కలిసి ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కుంకుమ, పసుపుతో ప్రత్యేక పూజలు నిర్వహించి,కొబ్బరికాయలు కొట్టి జెండా ఆవిష్కరణను శుభప్రదంగా ప్రారంభించారు. ''శ్రీ పరాభవ నామ సంవత్సరం''ఆరంభాన్ని పురస్కరించుకుని కులదేవత పెద్దమ్మ తల్లిని స్మరించుకుంటూ సంప్రదాయ పద్ధతుల్లో వేడుకలు నిర్వహించడం విశేషంగా నిలిచింది.అనంతరం ప్రతి సంవత్సరం లాగే ఈఏడాది కూడా ఆరు రుచులతో తయారు చేసిన ఉగాది పచ్చడి,జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పంచిపెట్టారు.ఉగాది పచ్చడిలోని రుచుల మాదిరిగానే జీవితం సుఖదుఃఖాల సమ్మేళనమని,వాటిని సమానంగా స్వీకరించే సంస్కృతి మనదని నాయకులు వివరించారు.
ఈ కార్యక్రమం ద్వారా సామాజిక బంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా మాట్లాడిన సంఘ నాయకులు... ముదిరాజ్ జాతి చారిత్రక సంప్రదాయాలను కాపాడుతూ కొత్త తరానికి అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.తెలంగాణ మూలవాసి జాతిగా ముదిరాజ్ సమాజం తన ప్రత్యేకతను నిలబెట్టుకొని,గ్రామ గ్రామాన ముదిరాజ్ జెండా ఎగురవేసి జాతి గౌరవాన్ని పెంపొందించడమే కాకుండా...గ్రామ గ్రామాన నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్ జాతి ఐక్యతకు నాంది పలికిందని నాయకులు అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు,ముదిరాజ్ నాయకులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




