17 April, 2026 | 2:14 AM

అవినీతి రాజ్యం

06-02-2026 01:57 AM

కాంగ్రెస్‌కు తెలంగాణ బంగారు బాతు

ప్రజాధనాన్ని దోచుకుంటున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు 

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, రాహుల్, ఖర్గేల మధ్య ఒప్పందం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ముషీరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో అవినీతి పాలన రాజ్యమేలుతున్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. అవినీతి తప్ప రాష్ట్ర అభివృద్ధి శూన్య మని ఆయన ఆరోపించారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం, 26 నెలల కాంగ్రెస్ హయాంలో తెలంగాణ పట్టణ ప్రాంతాలు క్షీణించిన తీరును ఆయన వివరించారు. గురువారం సేవ్ తెలంగాణ పేరిట ముషీరాబాద్ లోని ఓ హాల్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన సమావేశంలో కిషన్‌రెడ్డి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ప్రత్యేక గీతాన్ని కూడా ఆవిష్కరించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయి తప్ప ప్రజల అవసరాలను తీర్చడం లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బంగారు బాతు అయిందని విమర్శించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తెలంగాణ నుంచే డబ్బులు వెళ్తున్నాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో అనేక విమానాశ్రయాలు ఉన్నాయని, తెలంగాణలో ఎందుకు లేవని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఎందుకు విమానాశ్రయాల ఏర్పాటుకు కృషి చేయ లేదని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, రాహుల్‌గాంధీ, మల్లికార్జున్ ఖర్గేల మధ్య ఢిల్లీ స్థాయిలో రహస్య ఒప్పందం జరిగిందని, అందువల్లే ఆ కేసులో బీఆర్‌ఎస్ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో హైకోర్టు జడ్జిలు, సినిమా హీరోయిన్లు, పత్రికా యాజమాన్యాలు, విలేకరుల ఫోన్లు, చివరకు సొంత అల్లుడి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడంతో పాటు, కేసీఆర్ కూతురే స్వయంగా ప్రకటించినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవ న్నారు.

పోలీసు అధికారిని సీఐగా డిమోషన్ చేయడం తప్ప ఏమీ లేదన్నారు. దీనిని ఒక సాధారణ పోలీస్ ఆఫీసర్ తప్పుగా చూపి స్తూ, నిజమైన నిందితులను కాపాడే ప్రయ త్నం జరుగుతోందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి గెలిచినా అభ్యర్థులు చివరకు కాంగ్రెస్‌లోనే చేరుతారని అన్నారు. ప్రజలు వాస్తవాలను గమ నించి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని బలపరచాలని కోరారు.

ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన బెనిఫిట్స్ ఇవ్వడం లేదని, నగరంలో 50% పైగా విద్యుత్ దీపాలు వెలుగ కున్నా వాటిని బాగు చేసేందుకు నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. ము న్సిపాలిటీలలో సిబ్బంది కొరత వల్ల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పా రు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పి, బీజేపీని బలపరచాలని కోరా రు.

బీఆర్‌ఎస్ పాలనలో ముఖ్యమంత్రి కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన అవినీతిపై దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఈ 26 నెలల పాలనలో ఏం చేసిందో చెప్పాలని సవాల్ చేశారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో కూడా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య తేడా లేదని కిషన్‌రెడ్డి అన్నారు. 

80 వేల కోట్ల అప్పు: రాంచందర్‌రావు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మాట్లాడుతూ.. ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడ్డాక వ్యయం పెరిగిందని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి లాగితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో 80 వేల కోట్ల అప్పులు చేసి ప్రజలకు మోయలేని భారాన్ని మిగిల్చారని విమర్శించారు. గతంలో కేసీఆర్ చేసిన అవినీతిని ఆయన కూతురు కవిత స్వయంగా వెల్లడిస్తున్నారని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు చేస్తున్న అవినీతిని ఒకరిపై ఒకరు స్వయంగా ఆరోపణలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రెండు ప్రభుత్వాల హయాంలో రాష్ట్రంలో 127 మున్సిపాలిటీలు రూ. 3,600 కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయాయని వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అప్పు రూ.5వేల కోట్లకు చేరిందని వెల్లడించారు. అభివృద్ధి కనిపించక పోయినా, అప్పుల భారం మాత్రం మున్సిపల్ సంస్థలపై తీవ్రంగా మోపారని విరుచుకుపడ్డారు.

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు మున్సిపాలిటీల అభివృద్ధిని విస్మరించి ఏం ముఖం పెట్టుకొని మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ఈ పరిస్థితుల నుంచి విముక్తి రావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎస్‌ను మర్చిపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఆ పార్టీని ప్రజలు నమ్మేస్థితిలో లేరని అన్నారు.

మూసీ ప్రక్షాళనను ఏనాడు బీజేపీ అడ్డుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో పేద ప్రజల ఇండ్లను కూలిస్తే ప్రశ్నిస్తున్న బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తున్నామని చెపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, పాడైపోయిన డొక్కు బస్సులను నడుపుతూ మహిళల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతోందని మండిపడ్డారు. 

కాంగ్రెస్ పాలనలో 1,500 మంది అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబ డినప్పటికీ, వారిపై సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల అవినీతి మరింత పెరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ‘మార్పు’ పేరుతో ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. పట్టణ ప్రాంతాల్లో నేరాలు పెరగడం, నిరుద్యోగం అధికమవడం, మౌలిక వసతులు క్షీణించటం స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. రేవంత్ ప్రభుత్వం ఓ వర్గం ఓట్ల కోసం దిగజారి పాలిటిక్స్ చేస్తోందని రాంచందర్‌రావు మండిపడ్డారు.

రాష్ర్టంలో హిందూ దేవాలయాలను కూలగొట్టడం, ఆలయాలపై దాడులు జరగడం ఆందోళనకరమని అన్నారు. రాష్ర్టంలో మహిళలకు భద్రత పూర్తిగా కరువైందని, శాంతిభద్రతలు క్షీణించాయని రాంచందర్‌రావు విమర్శించారు. రాష్ర్టంలో ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేక సుమారు 40 మంది వరకు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని తెలిపారు. ఇవన్నీ పరిణామాలు కలిసి పట్టణ తెలంగాణను అవినీతి, అప్పులు, అస్తవ్యస్త పరిపాలన వైపు నెట్టాయని, దీనికి పూర్తి బాధ్యత బీఆర్‌ఎస్, -కాంగ్రెస్ పాలనలదేనని స్పష్టం చేశారు.

జీవో 27 ద్వారా రూ.6.3 లక్షల కోట్ల భూముల దోపిడీ, మూసీ సుందరీకరణ పేరుతో ప్రజాధన దుర్వినియోగం, భూ లావాదేవీలు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భారీ కమీషన్లు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మంత్రి ఆశిష్ చంద్ర, ఎంపీ బీబీ పాటిల్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందద్ గౌడ్, బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు భరత్ గౌడ్, వీరేందర్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్‌రెడ్డి, కార్పొరేటర్లు సుప్రియ నవీన్ గౌడ్, ఎ.పావని వినయ్ కుమార్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పూసరాజు, నాయకులు సీకే శంకర్‌రావు, బిజ్జి కనకేష్ కుమార్ పాల్గొన్నారు.