26 June, 2026 | 7:50 PM

ఐకేపీ వీఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి

26-06-2026 06:44 PM

– సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ డిమాండ్

దమ్మపేట,(విజయక్రాంతి): ఐకెపి విఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం 180000 రూపాయలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. ఐకెపి వివో ఏ ల మండల కమిటీ సమావేశం శుక్రవారం ధనలక్ష్మి అధ్యక్షతన సిఐటియు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళ స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేస్తూ మహిళలు ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించటంలో కీలక పాత్ర వహిస్తున్నారని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.

అయినా వీరి శ్రమను ప్రభుత్వాలు గుర్తించడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కార్మికుల కనీస వేతనాలు సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, దీని ప్రకారం నైపుణ్యం ఉన్నవారికి 18000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించిందని అన్నారు. ఈ జీవో ప్రకారం ఐకెపి వివో ఏ లకు 18000 రూపాయల నైపుణ్యం ఉన్నవారు అయినందున 18 వేల రూపాయలు జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన జీవోలను తానే అమలు చేయడం లేదని, అందుకే పాలకుల విధానాలను ప్రశ్నించాలని ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పై రెండున్నర సంవత్సరాల కాలంలో ఐకెపి వివోఏల డిమాండ్ల సాధనకై దశలవారీగా ఆందోళన లు నిర్వహించి, సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చిన ఫలితంగా వివోఏలకు గుర్తింపు కార్డులు, డ్రెస్ కోడ్, జీవో 58 రద్దు, గ్రేడింగ్ లేకుండా వేతనాలు చెల్లించడానికి అంగీకరించిందని, వీటిని అమలుపరచడానికి ప్రభుత్వంపై ఐక్యంగా ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు, నాగమణి, శ్రీదేవి, వెంకటమ్మ, వరలక్ష్మి, దేవి తదితరులు పాల్గొన్నారు.