చెక్‌బౌన్స్ చెల్లింపులపై కొరడా!
ఫలితాన్నిస్తున్న కేసుల నమోదు
రూ. 11 కోట్లలో రూ. 6 కోట్లు రికవరీ
మరో 900 మందికి నోటీసులు సిద్దం
నేటి నుంచి నోటీసులు జారీ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (విజయక్రాంతి) : హైదరాబాద్ నగరంలో ప్రాపర్టీ ట్యాక్స్ చెక్కులు బౌన్స్ కావడంతో చెల్లింపుదారులపై బల్దియా కొరడా ఝులిపిస్తోంది. ఇప్పటికే రూ. 11కోట్ల విలువ కలిగిన చెక్కులు బౌన్స్ అయిన నేపథ్యంలో పలువురిపై బల్దియా కేసులు నమోదు చేసింది. వీరిపై కేసుల నమోదు చేయడంపై సత్ఫలితాలు ఇవ్వడంతో చెక్కుబౌన్స్ చెల్లింపుదా రులకు పెద్ద మొత్తంలో నోటీసులు ఇచ్చేందుకు బల్దియా రంగం సిద్ధం చేసుకుంది.
రూ. 6కోట్లు రికవరీ..
బల్దియాలో ఆస్తిపన్ను చెల్లింపుదారులు 2023 ఏడాదిలో ప్రాపర్టీ ట్యాక్స్ రూ. 1914.87కోట్లు వసూలయింది. వీటిలో సుమారు 800కోట్లను ప్రాపర్టీ ట్యాక్స్ విభాగం సిబ్బంది ఇంటింటికీ తిరిగి చెక్కుల ద్వారా ఆస్తిపన్ను వసూలు చేశారు. వీటిలో 40శాతం చెక్కులు బౌన్స్ అయినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తం దాదాపు రూ. 300కోట్ల వరకూ ఉంటుందని అంచనా. చెక్కులు బౌన్స్ కారణంగా బల్దియాకు వందల కోట్ల లావాదేవీలు నిలిచిపోతున్నాయి. కళ్లముందే చెక్కులు ఉన్నప్పటికీ, క్యాష్ చేసుకోలేకపోతోంది. ఈ సమస్యను పరిష్కరించాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ ప్రత్యేక కసరత్తుకు శ్రీకారం చుట్టారు. ముందుగా రూ. 11 కోట్లకు సంబంధించిన బౌన్స్ చెక్కులను గుర్తించి 39మందిపై పోలీస్ స్టేషన్‌లలో జీహెచ్‌ఎంసీ అధికారులు ఫిర్యాదులు చేయడంతో వారిపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులు కారణంగా రూ. 11కోట్లలో రూ. 6కోట్ల ట్యాక్స్ రికవరీ అయ్యింది. కేసులు నమోదు చేయడం మంచి ఫలితాన్ని ఇవ్వడంతో మొత్తం చెక్కు బౌన్స్ చెల్లింపుదా రులకు నోటీసులు జారీ చేయాలని జీహెచ్‌ఎంసీ భావించింది.
900మందికి నోటీసులు
గతేడాది (2023 ప్రాపర్టీ ట్యాక్స్‌లో చెక్కుల ద్వారా చెల్లించిన మొత్తాలను క్లియర్ చేసే పనిలో జీహెచ్‌ఎంసీ నిమగ్నమైంది. ఈ క్రమంలో 39మందిపై కేసులు నమోదు మంచి ఫలితాన్నే ఇవ్వడంతో మిగతా చెక్కు బౌన్స్ చెల్లింపుదారులపై ప్రాపర్టీ ట్యాక్స్ విభాగం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో 19కోట్ల విలువ చేసే 900 చెక్కులు బౌన్స్ అయినట్టుగా గుర్తించి, వారిపై కేసులు నమోదు చేయాలని భావించింది. కేసుల నమోదు కంటే ముందుగా నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. అందుకు సంబంధించిన 900నోటీలను జీహెచ్‌ఎంసీ ప్రిపేర్ చేసింది. ఈ నోటీసులు ఆదివారం నుంచి సంబంధిత చెల్లింపుదారులకు అందజేయనున్నట్టు జీహెచ్‌ఎంసీ చీఫ్ వాల్యూయేషన్ అధికారి మహేష్ కులకర్ణి తెలిపారు.






