చెప్పులు కొనిస్తామని బాలుడి కిడ్నాప్
పనివాడే కిడ్నాపర్
రూ. 15 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు
మూడుగుంటల్లోనే పట్టివేత
వివరాలు వెల్లడించిన సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ
సిద్దిపేట, ఏప్రిల్20: చెప్పులు కొనిస్తామంటూ పాఠశాల నుంచి బాలుడిని కిడ్నాప్ చేయగా, మూడుగంటల్లోనే పోలీసులు నిందితున్ని గుర్తించారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌లో పోలీస్ కమిషనర్ అనురాధ సిద్దిపేట జిల్లా మర్కూక్‌లో జరిగిన కిడ్నాప్ కేసు వివరాలను శనివారం విలేకరుల సమావేశంలో వివరించారు. మర్కూక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆస్పిరో ఫార్మాలో గత 8 సంవత్సరాలుగా బీహార్‌కు చెందిన తబ్రీజ్ ఆలం పని చేస్తున్నాడు. అతని పెద్దకొడుకు తావీద్ ఆలం(7) కర్కపట్ల ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు. రోజూ మాదిరిగానే పాఠశాలకు వెళ్లిన తావిద్ ఆలం మధ్యాహ్నం 3గంటలైనా ఇంటికి రాకపోవడంతో స్కూలుకు వెళ్లి పిల్లలను తావీద్ గురించి వాకబు చేశాడు. వారు ఎవరో చెప్పులు కొనిస్తామని 9:30 గంటలకు పాఠశాల నుంచి తీసుకువెళ్లారని పిల్లలు చెప్పిన ట్లు తండ్రి తబ్రీజ్ పోలీసులకు ఫిర్యాదు పేర్కొన్నారు. వెంటనే మర్కూక్ ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి కర్కపట్ల గ్రామానికి వెళ్లి పాఠశాల సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి తావీద్ ఆలంను గుర్తు తెలియని వ్యక్తి తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు.
తావీద్ కిడ్నాప్ అయినట్లు తెలుసుకున్న కొద్దిసేపటికీ తండ్రి తబ్రీజ్‌కు కొత్త నంబర్ నుంచి కిడ్నాపర్లు ఫోన్ చేసి తావీద్‌ను విడుదల చేయాలంటే రూ. 15లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే మర్కూక్ ఎస్‌ఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం, రూరల్ సీఐ ఆధ్వర్యంలో మరో టీం ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, రైల్వే పోలీస్ సహకారంతో పాటు సాంకేతిక ఆధారాలతో కిడ్నాపర్లను, బాలున్ని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర పట్టుకున్నట్లు సిద్ది పేట పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. కాగా నిందితుల్లో అనూప్ చౌదరి తబ్రీజ్ ఆలం వద్ద 8నెలల క్రితం పనిచేస్తున్న సమయంలో కొంత డబ్బు అనూప్ చౌదరికి బాకీ పడ్డాడు.
ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడంతో తబ్రీజ్‌ను ఆలంను భయపెట్టాలని కొడుకు తావీద్‌ను కిడ్నాప్ చేసి రూ. 15లక్షలు డిమాండ్ చేశారు. బస్సులో ఎక్కి సికిం ద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ఉదయం 11:30గంటల సమయంలో చేరుకున్న అనూప్ చౌదరితో చందన్‌కుమార్‌దాస్ (జార్ఘాండ్), మేఘనాథ్ కర్మాకర్(అస్సాం)లు కలవగా వారికి విషయం వివరించి డబ్బులు అంద రం పంచుకుందామని అనూప్ చౌదరి చెప్పాడు. వారు ఆ ప్రయత్నంలో ఉండగానే మర్కూక్ ఎస్‌ఐ అరెస్టు చేశారని, వారిని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపుతున్నట్లు పోలీస్ కమిషనర్ అనురాధ వెల్లడించారు. కేసును మూడు గంటల్లో చేదించిన రూరల్ సీఐ మహేందర్‌రెడ్డి, మర్కూక్ ఎస్‌ఐ మధుకర్‌రెడ్డితో పాటు కానిస్టేబుల్ నర్సింహ, సాయి, రాజీరెడ్డిలను కమిషనర్ అభినందించి నగదు రివార్డు అందజేశారు.






