8 June, 2026 | 1:36 AM

ప్రజలు లేని ‘ప్రగతి ప్రణాళిక’.. వెలవెలబోయిన ‘హ్యాపీ సండే’!

08-06-2026 12:00 AM
  1. మున్సిపల్ సిబ్బంది, పాలకవర్గంతోనే మమః
  2. స్టేడియంలో చెత్త ఊడ్చడానికే పరిమితమైన కార్మికులు

చేవెళ్ల, జూన్ 7 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ (90 రోజుల కార్యాచరణ ప్రణాళిక) క్షేత్రస్థాయిలో పటిష్టత కొరవడి కుంటుపడుతోంది. మున్సిపల్ అధికారులు, పాలకవర్గం ప్రజలను భాగస్వామ్యం చేయడంలో పూర్తిగా విఫలమవ డంతో ప్రభుత్వ ఆశయం పక్కదారి పడుతోంది. ఆదివారం చేవెళ్ల మినీ స్టేడియంలో నిర్వహించిన ‘హ్యాపీ సండే’ కార్యక్రమం కేవలం ఇద్దరు చిన్నారులు మినహా, ప్రజలెవరూ రాకపోవడంతో కేవలం అధికారులకే ‘హ్యాపీ సండే’గా ముగిసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఫొటోలకే పరిమితమైన ప్రచారంఆదివారం ఉదయాన్నే మున్సిపల్ అధికారులు, సిబ్బంది స్థానిక మినీ స్టేడియానికి చేరుకున్నారు. స్టేడియంలో పేరుకుపోయిన చెత్తను సఫాయి కార్మికులతో శుభ్రం చేయించారు. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత ‘ప్రజాపాలన ప్రగతి- ప్రణాళిక’ బ్యానర్ను ప్రదర్శించి, ఫొటోలు దిగి అధికారులు, పాలకవర్గ సభ్యులు చేతులుదులుపుకున్నారు. ప్రజాధనాన్ని లక్షల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటే, ఇందులో స్థానిక ప్రజల భాగస్వామ్యం శూన్యంగా మారడం గమనార్హం.

ప్రజల్లో జోరుగా చర్చ..

ప్రగతి ప్రణాళికా లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అధికారులు, పాలకవర్గ సభ్యులు పూర్తిగా విఫలమయ్యారని ఈ కార్యక్రమాన్ని చూసిన స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.

జనసమీకరణ చేయకుండా, కనీస సమాచారం అందించకుండా కేవలం మున్సిపల్ సిబ్బందితోనే కార్యక్రమాన్ని కానిచ్చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రగతి ప్రణాళికను కాగితాలకే పరిమితం చేయకుండా, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పటిష్టంగా నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.