1 August, 2026 | 2:15 AM

మార్కెట్ కమిటీలపై నిఘా!

01-08-2026 01:31 AM
  1. అవినీతి, అక్రమాల కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు   
  2. విజిలెన్స్ బృందాలతో తనిఖీలు
  3. కొనుగోళ్లు, రైతుల సమస్యలు, ఫిర్యాదులపై ఆరా
  4. డిజిటల్ సేవలు, రికార్డుల పరిశీలన
  5. దళారీ వ్యవస్థ, అధికారుల చేతివాటంపై దృష్టి
  6. తనిఖీ బృందాల నివేదికల ఆధారంగా చర్యలు

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి) : తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్లలో అవినీతి, అక్రమాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో చోటు చేసుకుంటున్న అవకతవకలు, దళారీ వ్యవస్థ, అధికారుల నిర్లక్ష్యం, చేతివాటంపై ప్రత్యేక నిఘా పెట్టాలని నిర్ణయించింది.

ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా ఆరు విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేసి, వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల పనితీరుపై తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ బృందాలు మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో రైతులకు అందుతున్న సేవలు, కొనుగోలు విధానాలు, డిజిటల్ సేవల అమలు, రికార్డుల నిర్వహణతో తదితర విషయాలపై క్షేత్రస్థాయిలో ఆరా తీయనున్నాయి. 

ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు

రాష్ట్ర వ్యాప్తంగా 197 వ్యవసాయ మార్కెట్‌లు పని చేస్తున్నాయి. ఈ మార్కెట్‌లలో వరి, పత్తితో ఇతర పంట ఉత్పత్తులను రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు.అయితే కొనుగోళ్ల విషయంలో అధికారులు, మధ్యవర్తులు కుమ్మక్కై రైతులనుంచి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి.

ప్రధానంగా పత్తి కొనుగోళ్లలో జిన్నింగ్ మిల్లుల నుంచి అధికారులు చేతివాటం ప్రదర్శించి, రైతులకు నష్టం చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వీటితో పాటు తూకాల్లో తేడాలు, నాణ్యత పేరుతో కోతలు, చెల్లింపుల్లో జాప్యం, దళారుల జోక్యం వంటి అంశాలపై ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రత్యేకంగా తనిఖీ బృందాలను ఏర్పాటు చేసింది. 

అవినీతికి చెక్ పడేనా?

విజిలెన్స్ తనిఖీలతో వ్యవసాయ మార్కెట్‌లలో అవినీతి, అక్రమాలకు చెక్ పడుతుందా? అనేది చర్చనీంశం గా మారింది. ఎందుకంటే వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు వసూలు రాజాలే ఎక్కువగా ఉంటారనే టాక్ ఉంది. విజిలెన్స్ బృందాలు వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకుల నియంత్రణలో పనిచేస్తూ  రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్లలో తనిఖీ చేపట్టనన్నాయి.

ప్రతివారం తనిఖీ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించనున్నాయి. గుర్తించిన లోపాలు, తక్షణ చర్యలు అవసరమైన అంశాలు, విధానపరమైన సంస్కరణలు, మార్కెట్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన సూచనలు పొందుపరుస్తాయని అధికారులు చెబుతున్నారు. 

తనిఖీ బృందాలు దృష్టి సారించే ప్రధాన అంశాలు

* రైతులు పంట ఉత్పత్తుల విక్రయ సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలు

* మద్దతు ధర, కొనుగోలు కార్యకలాపాల్లో లోపాలు, ఇబ్బందులు

* రైతులు పంటలను మద్దతు ధరకు కాకుండా తక్కువ ధరలకు విక్రయించాల్సిన పరిస్థితులకు కారణాలు 

* మార్కెట్ సెస్ ఎగవేతను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలు 

* మార్కెట్ కమిటీల పరిపాలన, మౌలిక సదుపాయాలు, సేవలపై సూచనలు

* రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర పొందుతున్నారా? వేలం ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందా?  

* రైతులకు మద్దతు ధర దక్కుతుందా?, కొనుగోలు కేంద్రాల నిర్వహణ, కొనుగోళ్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, చెల్లింపులు సకాలంలో జరుగుతున్నాయా?

* డిజిటల్ సేవలు, రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ మార్గదర్శకాల అమలును పరిశీలిస్తారు.