1 August, 2026 | 2:19 AM

మనకూ ఓ తుకారాం కావాలి!

01-08-2026 01:36 AM

హైదరాబాద్ పేరు చెప్పగానే బిర్యానీ, స్ట్రీట్ ఫుడ్ ఎక్కువగా గుర్తుకువస్తాయి. కానీ ఇటీవల కాలంలో కల్తీ ఆహారం, నాసిరకం పాలు, నకిలీ పన్నీర్, కల్తీ నెయ్యి, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, అపరిశుభ్రమైన వంట శాలలు, కుళ్లిన మాంసం వంటి ఘటనలతో హైదరాబాదీలు బెంబేలెత్తారు. పోలీసులు ఏర్పాటు చేసిన హెచ్‌ణి జీహెచ్‌ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారుల వరుస దాడుల్లో కేవలం వంద రోజుల్లోనే 185 కేసులు నమోదు కాగా 122 టన్నులకు పైగా కల్తీ, నాసిరకం ఆహార పదార్థాలు పట్టుబడ్డాయి.

ఆ తర్వాత షరా మూమూలే. ఇలాంటి సందర్భంలోనే మహారాష్ట్రలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్‌గా  తుకారాం ముండే వేలాదిగా తనిఖీలు చేస్తూ, కల్తీ ఆహార మాఫియాపై ఉక్కుపాదం మోపుతూ, ఎంత పెద్ద సంస్థ అయినా చట్టం ముందు ఒకటేనన్న సందేశంతో వ్యవహరిస్తున్నారు.

అయితే హైదరాబాద్‌లోనూ నిబంధనలను ఉల్లంఘించే వారికి భయం కలిగించేలా, ఎలాంటి రాజకీయ, వ్యాపార ఒత్తిళ్లకూ లొంగని తుకారాం ముండే తరహా అధికారి ఇక్కడ కూడా అవసరమనే భావన ప్రజల నుంచి బలంగా వినిపిస్తోంది. 

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి) : దేశంలో నిజాయితీగా విధులు నిర్వర్తించే అధికారులు అరుదుగా కనిపిస్తున్న ఈ రోజుల్లో.. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారి తుకారాం ముండే పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కఠిన మైన పరిపాలన, ఆర్థిక క్రమశిక్షణ, అవినీతిపై రాజీలేని వైఖరి, నిబంధనలను అమలు చేయడంలో రాజీపడని తత్వం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.

21 ఏళ్ల ఆయన సర్వీస్ కాలంలో దాదాపు 25 సార్లు బదిలీ కావడం కూడా ఆయన నిజాయితీకి నిదర్శనంగా ప్రజలు భావిస్తున్నారు. అధికార యం త్రాంగంలో నియమ నిబంధనలను కచ్చితంగా అమలుచేయడం వల్లే తరచూ బదిలీలకు గురయ్యారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. తుకారాం ముండే ఇటీవల చేపట్టిన ఆహార భద్రత తనిఖీలు దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కల్తీ ఆహారం, నాసిరకం పదార్థాలపై ఆయన తీసుకుంటున్న కఠిన చర్యలను ప్రశంసిస్తూ హైదరాబాద్ ప్రజ లు కూడా ‘మనకూ ఇలాంటి అధికారి కావాలి’ అని అభిప్రాయపడుతున్నారు. దీనిపై మణికొండకు చెందిన 26 ఏళ్ల యూట్యూబ్ ఫిల్మ్‌మేకర్ కుశాల్ స్పం దిస్తూ.. ‘బ్యాచిలర్‌గా బయట ఆహారంపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఇటీవల కల్తీ ఆహా ర ఘటనలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో తుకారాం ముండే చేస్తున్న ఫుడ్ సేఫ్టీ దాడులు అభినందనీయం.

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే అధికారులు హైదరాబాద్‌లో కూడా ఉండాలి’ అని వెల్లడించారు. కేపీహెచ్‌బీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగి రూపేష్ రెడ్డి స్పందిస్తూ.. కఠిన చర్యలు తీసుకునేందుకు మాత్రమే కాదు.. బాధ్యత వహించేందుకు తుకారాం ముండే వంటి అధికారి ఉండటం ఎంతో అవసరం. తనిఖీలు కఠినంగా ఉంటేనే రెస్టారెంట్లు నిబంధనలు పాటిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యం వ్యాపార లాభాల కంటే ముఖ్యమైనదని అభిప్రాయపడ్డారు. 

ప్రజాకేంద్రీకృత పరిపాలన..

కేవలం చేసే పనిలో కఠినత్వం పాటించడమే తుకారాం ముండే ప్రత్యేకత కాదు.. ఆర్థిక క్రమశిక్షణ, ప్రజా సేవల మెరుగుదల, నిబంధనల కచ్చితమైన అమలు, ప్రజాకేంద్రీకృత పరిపాలన ఆయన పని తీరుకు గుర్తింపుగా నిలిచాయి. మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో పౌర సేవల పర్యవేక్షణ, ఉద్యోగుల హాజరు వ్యవస్థ, మౌలిక వసతుల నిర్వహణలో అనేక సంస్కరణలు చేపట్టారు.

2026 మేలో మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం రెండు నెలల్లోనే 1,100కుపైగా తనిఖీలు నిర్వహించారు. కోట్ల రూపాయల విలువైన కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. భారీ స్థాయిలో కల్తీ పాలు, గుట్కా అక్రమ రవాణాపై చర్యలు తీసుకున్నారు. ముంబైలోని పలు ప్రముఖ హోటళ్లు, ఆహార సంస్థల లైసెన్సులను కూడా సస్పెండ్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై ఎలాంటి కనికరం చూపబోమని ముండే హెచ్చరించారు.

దీంతో సపోర్టర్స్ ఆయనను ప్రజాస్వామ్యంలో ‘సింగం’ అని పోల్చారు. అయితే తుకారాం ముండే చర్యలతో ఆయనకు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదురయ్యాయి. అయినప్పటికీ ఆయన వ్యక్తిగత నిజాయితీపై మాత్రం పెద్దగా సందేహాలు వ్యక్తం కాకపోవడం తుకారాం నిబద్ధతకు నిదర్శనం. దీనిపై హిమాయత్‌నగర్‌కు చెందిన విద్యార్థిని కావ్య పాలేటి స్పందిస్తూ... ‘హైదరాబాద్‌లో ఆహార కల్తీ కేసులు పెరుగుతున్నాయి.

ఇలాంటి సమయంలో తుకా రాం ముండే లాంటి అధికారులు ఉంటేనే కఠిన చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుంది’ అని స్పష్టం చేశారు. అయితే తుకా రాం ముండే పనిచేసిన అనేక చోట్ల రాజకీయ వివాదాలు ఆయనను వెంటాడాయి. అక్రమాలు, ఇసుక మాఫియా, పరిపాలనా సంస్కరణలు, నకిలీ వికలాంగ ధృవపత్రాలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలపై చర్యలు తీసుకోవడం వంటి అంశాల్లో రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. వాటి తర్వాతే తరచూ బదిలీలు జరిగాయని స్థానిక ప్రజలు చెబుతారు. అయితే ఆయన మాత్రం ప్రతి పోస్టులోనూ నిబంధనల అమలుపైనే దృష్టి పెట్టడం వల్ల ప్రజల్లో విశేష ఆదరణ పొందారు.

అందుకున్న పురస్కారాలు..

* 2015--16 సీఎం చేతుల మీదుగా ఉత్త మ జిల్లా కలెక్టర్ అవార్డు

* 2016లో ‘వాటర్ మ్యాన్ ఆఫ్ మహారాష్ట్ర’ అవార్డు

* స్వచ్ఛ మహారాష్ట్ర ప్రచారంలో సీఎం ప్రశంస

* 2015లో పండర్‌పూర్ ఆశాఢీ వారీ నిర్వహణలో విశేష సేవలకు సత్కారం

* స్కోచ్ సిల్వర్ స్మార్ట్ సిటీ అవారు-2017

* దివ్యాంగుల సాధికారత జాతీయ అవార్డు--2017

* మహాత్మా ఫూలే జలమిత్ర అవార్డు

* సామాజిక న్యాయం, సాధికారత జాతీయ పురస్కారం

ఎవరీ తుకారాం ముండే? 

జూన్ 3, 1975 తేదీన మహారాష్ట్రలోని బీడ్ జిల్లా, తాడ్‌సొన్నా గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో తుకారాం ముండే జన్మించారు. జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయంలో చరిత్రలో బీఏ, రాజకీయ శాస్త్రంలో ఎంఏ పూర్తి చేశారు. 2005లో యూపీఎస్సీ సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించి మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్‌గా ఎంపికయ్యారు.

ఆయన విధుల్లో చేరిన మూడో రోజే అక్రమ బార్‌పై దాడి చేసి తన ధైర్యాన్ని చాటుకున్నారు. ఐటీడీపీ ప్రాజెక్ట్ ఆఫీసర్, అసిస్టెంట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, స్మార్ట్ సిటీ సీఈఓ, ట్రాన్స్‌పో ర్ట్, విపత్తు నిర్వహణ, వికలాంగుల సంక్షేమం తదితర కీలక బాధ్యతలు నిర్వహించారు. 

హైకోర్టు క్యాంటీన్‌పైనా దాడి 

నవి ముంబైలోని ఓ హోటల్ లైసె న్స్ సస్పెన్షన్‌ను బాంబే హైకోర్టు రద్దు చేసిన రెండు రోజులకే, మహారాష్ట్ర ఎఫ్‌డీఏ అధికారులు బాంబే హైకోర్టు ప్రాంగణంలోని కాంటీన్లపై కూడా తనిఖీలు నిర్వహించి సంచటనం సృష్టించారు. దీంతో చట్టం ముందు ఎవరూ మినహాయింపు కాదనే సందేశాన్ని తుకారాం ముండే మరోసారి స్పష్టం చేశారని ఈ ఘటనపై చర్చ జరిగింది.