1 August, 2026 | 2:37 AM

మిల్లర్లలో ముసలం!

01-08-2026 01:29 AM
  1. పెద్ద, చిన్న మిల్లర్లుగా చీలిక
  2. ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు
  3. గత ప్రభుత్వంలో పెద్ద మిల్లర్ల పెత్తనం
  4. తమను పట్టించుకోలేదని చిన్న మిల్లర్ల  వాదన
  5. ప్రత్యేక అసోసియేషన్ ఏర్పాటు
  6. తమ సమస్యలు నేరుగా ప్రభుత్వం దృష్టికి  

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): రాష్ర్ట రైస్ మిల్లింగ్ రంగంలో ఆధిపత్య పోరు మరోసారి తెరపైకి వచ్చింది. పెద్ద మిల్లర్లు, చిన్న మిల్లర్లుగా విడిపోయి తమ సమస్యలను ఎవరికివారే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ పరిణామాలతో మిల్లింగ్ రంగానికి ఎవరు నిజమైన ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో విజిలెన్స్ తనిఖీలు, దాడులు కొనసాగుతుండటంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు మరింత బహిర్గతమవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఒక వర్గం నుంచి సమాచారం తీసుకుని, మరో వర్గం మిల్లుల్లో విజిలెన్స్ తనిఖీలు, దాడులు నిర్వహిస్తుందనే వాదన వినిపిస్తోంది.  

అప్పట్లో పెద్ద మిల్లర్లు చెప్పిందే మాట

చిన్న మిల్లర్ల వాదన ప్రకారం.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద మిల్లర్లకే అధిక ప్రాధాన్యం లభించింది. ధాన్యం కేటాయింపులు, బిల్లుల చెల్లింపులు, ఇతర పరిపాలనా నిర్ణయాల్లో పెద్ద మిల్లర్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. తమ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి లేకపోయేది.  మిల్లర్ల అసోసియేషన్‌లో కూడా పెద్ద మిల్లర్లదే ఆధిపత్యం. రాజకీయ అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారని, చాలా మంది రాజకీయ నేతలే మిల్లర్లుగా, బినామీ పేర్లతో ధాన్యం, బియ్యం వ్యాపారాలు కొనసాగించారని చిన్న మిల్లర్లు ఆరోపిస్తున్నారు.

అప్పటి ప్రభుత్వ పెద్దలకు బడా మిల్లర్ల నుంచి భారీగానే ముడుపులు ముట్టేవనే అపవాదు ఉంది. పెద్ద మిల్లర్ల ప్రయోజనాలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం, సివిల్ సప్తు శాఖ నిర్ణయాలు తీసుకునేదనే చర్చ ఉంది. వారికి ఎక్కువ ధాన్యం కేటాయించేవారని, బిల్లుల చెల్లింపు, ఎలాంటి తనిఖీలు లేకుండా యధేచ్ఛగా వారి కార్యకలాపాలు నడిచేవి.

తమ విషయానికొస్తే తక్కువ ధాన్యం కేటాయింపు, అధికారులు, రాజకీయ నాయకుల వేధింపులు, బిల్లులు సరిగా చెల్లించకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొన్నామని  చిన్న మిల్లర్లు అంటున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వారు కాదని, అసోసియేషన్ పెద్ద మిల్లర్ల అజమాయిషీలో ఉండటంతో తాము ఏమీ చేయలేని పరిస్థితి ఉండేదని  వాపోతున్నారు.

అందరూ ఒక్కటే.. తనిఖీలే వేర్వేరు

రాష్ట్రంలో కొన్ని మిల్లులు మినహా.. మిగతా వాటన్నింటిలో ధాన్యం గోల్‌మాల్ జరుగుతూనే ఉంది. ప్రత్యేక రాష్ర్టం ఏర్పడిన తరువాత సీఎంఆర్ ధాన్యంలో అక్రమాలు పెరిగాయి.   అదే సమయంలో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో పెద్ద మిల్లుల రాజ్యం నడిచింది. భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న సీఎంఆర్ అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించింది.

ముఖ్యంగా పెద్ద మిల్లులో పెద్ద ఎత్తున ధాన్యం పక్కదారి పట్టడంతో పెద్ద మిల్లుల్లో  విజిలెన్స్ దాడులు, తనిఖీలు విస్తృతం చేసింది. నిందితులపై కేసులు నమోదు చేసింది. ఇదే సమయంలో చిన్న మిల్లులను కూడా వదలడం లేదు. అక్రమాలు, అవినీతికి పాల్పడింది ఎవరైనా సరే.. వదిలిపెట్టబోమని హెచ్చరించింది. 

ప్రత్యేక సంఘంగా చిన్న మిల్లర్లు

గత ప్రభుత్వం హయాంలో ఎదురైన అనుభవాలు, తమ కష్టనష్టాలను ఎవరూ పట్టించుకోకపోవడంతో చిన్న మిల్లర్లు అందరూ కలిసి ప్రత్యేకంగా సంఘం పెట్టుకున్నారు. పెద్ద మిల్లర్లందరూ పాత సంఘంలోనే కొనసాగుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఈనేపథ్యంలోనే చిన్న మిల్లర్లందరూ.. తమ సమస్యలపై ప్రభుత్వానికి విజ్ఞాపనలు ఇస్తున్నారు. తమ కష్టాలు, నష్టాలు, సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు.