డబుల్ బొనాంజా

27-04-2024 12:39:55 AM

పరుగుల విందు పంచుతున్న ఐపీఎల్లో నేడు రెండు మ్యాచ్‌లు కనువిందు చేయనున్నాయి. డబుల్ హెడర్‌లో భాగంగా తొలి పోరులో ఢిల్లీతో ముంబై తలపడనుం డగా.. రెండో మ్యాచ్‌లో లక్నోతో రాజస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది. ఐదుసార్లు చాంపియన్ ముంబై ఈ సీజన్‌లో నిలకడలేమితో బాధపడుతుంటే.. ఢిల్లీ కూడా పడుతూ లేస్తూ సాగుతున్నది. మరోవైపు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జోరుకు బ్రేక్ వేయా లని లక్నో సూపర్ జెయింట్స్ తహతహలాడుతోంది. మరింకెందుకు ఆలస్యం డబుల్ మజా ఆస్వాదించేందుకు మీరూ సిద్ధమైపోండి!

ఢిల్లీ x ముంబై

న్యూఢిల్లీ: ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపి టల్స్‌తో మ్యాచ్‌కు ముం బై ఇండియన్స్ సిద్ధమైంది. గుజరాత్‌తో జరిగిన గత మ్యాచ్‌లో కేవలం 4 పరుగుల తేడా తో విజయం సాధించిన ఢిల్లీ సొంతగడ్డపై మరో విజయం అందుకోవాలని చూస్తుంటే.. రాజస్థాన్ చేతిలో ఖంగుతిన్న ముంబై ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్స్ ఆశలను నిలుపుకోవాలనుకుంటోంది. ఢిల్లీ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉండగా.. ఆడిన 8 మ్యాచ్‌ల్లో మూ డు విజయాలతో ముంబై 8వ స్థానంలో కొనసాగుతోంది. ప్లేఆఫ్ రేసులో నిలవాలం టే ఇరుజట్లకు గెలుపు తప్పనిసరి. బలబలాల విషయానికి వస్తే ఢిల్లీ జట్టులో రిషబ్ పంత్, జేమ్స్ మెక్‌గుర్క్ మంచి ఫామ్‌లో ఉండగా.. ఓపెనర్ పృథ్వీ షా విఫలమవుతున్నాడు.

మొదట్లో స్థిరంగా ఆడిన ట్రిస్టన్ స్టబ్స్ టచ్ కోల్పోయి సతమతమవుతున్నాడు. ఇక గుజరాత్‌తో మ్యాచ్‌లో పించ్ హిట్టర్‌గా వచ్చిన అక్షర్ పటేల్ దుమ్మురేపాడు. దీంతో ముంబై తో మ్యాచ్‌కు అక్షర్ మరోసారి కీలకమయ్యే అవకాశముంది. బౌలింగ్‌లో కొత్తగా వచ్చిన రసిక్ సలామ్ ఆకట్టుకోగా.. ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్‌లు వికె ట్లు తీస్తుండడం సానుకూలాంశం. మరోవైపు ముంబై బ్యాటింగ్ విషయానికొస్తే బ్యాటింగ్ విభాగం అంతంతమాత్రంగానే ఉంది. రోహి త్ ఒక మ్యాచ్‌లో ఆడితే మరో మ్యాచ్‌లో విఫలమవుతున్నాడు. తిలక్ వర్మ, నిహాల్ వదేరాలు రాణిస్తున్నప్పటికి.. సూర్య సత్తాచాటాల్సిన అవసరముంది. కెప్టెన్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమవుతుండడం కలవరపెట్టే అంశం. బౌలింగ్‌లో బుమ్రా, కోట్జీ మాత్రమే రాణిస్తున్నారు. 

లక్నో x  రాజస్థాన్

లక్నో:  వరుస విజయాలతో జోరు మీదున్న రాజస్థాన్ రాయల్స్‌తో పోరుకు లక్నో సూపర్ జెయింట్స్ సిద్ధమైంది. లక్నో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు బలంగా ఉండడంతో టఫ్ ఫైట్ జరిగే అవకాశముంది. లీగ్‌లో భాగంగా తొలి అంచె పోటీల్లో లక్నోపై 20 పరుగుల తేడాతో గెలిచిన రాజస్థాన్ పైచేయి సాధించింది. దీంతో రేపటి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై గెలిచి లక్నో బదులు తీర్చుకోనుందా అన్నది ఆసక్తికరం. రాజస్థాన్ ఆడిన 8 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో పట్టికలో టాప్‌లో ఉండగా.. లక్నో ఆడిన 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో నాలుగో స్థానంలో ఉంది. కెప్టెన్ కేఎల్ రాహుల్, డికాక్, పూరన్, దీపక్ హుడాలతో పటిష్టంగా కనిపిస్తోంది. చెన్నైతో మ్యాచ్‌లో విధ్వంసకర సెంచరీతో చెలరేగిన మార్కస్ స్టోయినిస్ ఫామ్‌లోకి రావడం లక్నోకు శుభసూచకం.

ఇక బౌలింగ్‌లో రవి బిష్ణోయి, యష్ ఠాకూర్, మోసిన్ ఖాన్‌లతో పర్వాలేదనిపిస్తున్నారు. ఇక రాయల్స్ బ్యాటింగ్ విషయానికొస్తే కెప్టెన్ శాంసన్‌తో పాటు బట్లర్, జైస్వాల్, పరాగ్, హెట్‌మైర్, పావెల్‌తో శత్రుదుర్బేధ్యంగా కనిపిస్తోంది. ముంబైతో మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో జట్టును గెలిపించి జైస్వాల్ తన ఫామ్‌పై వస్తున్న సందేహాలను పటాపంచలు చేశాడు. ఇక బౌలింగ్‌లో బౌల్ట్, సందీప్, ఆవేశ్ ఖాన్‌లతో కూడిన పేస్ త్రయం రాణిస్తుండగా.. చహల్, అశ్విన్ ద్వయం స్పిన్ బాధ్యతలు మోస్తోంది.