26 June, 2026 | 1:48 AM

సాహు మహారాజ్ స్ఫూర్తికి తూట్లు

26-06-2026 12:00 AM

నేడు ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి :

ఛత్రపతి సాహు మహారాజ్ అంటే ఒక మానవతా సముద్రం. భారత సామాజిక విప్లవోద్యమాల చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖితమైంది. చరిత్రను ఆవాహన చేసుకుంటే, సాహు మహారాజ్ స్ఫూర్తి వర్త మానానికి దిశానిర్దేశం చేస్తుంది. ఏ దేశాన్నేలిన ఏ రాజైనా ప్రజలను పీడించి, వారి రక్తాన్ని తాగే పరాన్నజీవులుగా చరిత్రలో మిగిలిపోయారు. కానీ, సాహు మహారాజ్ శైలే వేరు. ఆయన నిజంగా అట్టడుగు వర్గాల గుండెల్లో నిలిచిన ప్రజా నాయకుడు, ఒక చల్లటి సూర్యుడు.

ఒక మహారాజుగా ఉం డి కూడా పాలకులకు, పాలితులకు మధ్య అసమానతలు ఉండకూడదని, అందరికీ సమానత్వం అందాలని పోరాడిన ధీరుడు ఆయన. ప్రపంచ చరిత్రలో అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడి, వివక్షకు గురైన సమూ హాల అభ్యున్నతికి బాటలు వేసిన మహనీయుడు సాహు మహారాజ్. జూన్ 26న సాహు మహారాజ్ 152వ జయంతిని పురస్కరించుకుని, ఆయన ఆశయాలను స్మరించుకుంటూ, నేటి సామాజిక పరిస్థితుల్లో రిజర్వేషన్ల వ్యవస్థ ఎలా వక్రీకరించబడుతుందో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

1902లో కోల్హాపూర్ సంస్థానంలో వెనుకబడిన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం ద్వారా, అణగారిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో మొదటిసారిగా హక్కు ను కల్పించిన సామాజిక విప్లవమూ ర్తి సాహు మహారాజ్. శతాబ్దాలుగా అణచివేతకు గురైన వారికి అధికారం దక్కాలని ఆయన భావిం చారు. అయితే, ఆయన ఆశయాలకు భిన్నంగా నేటి పాలనలో రిజర్వేషన్ల అసలు లక్ష్యం నీరు గారుతోంది. రిజర్వేషన్లు సామాజిక న్యాయం కోసం కాకుండా, కేవలం రాజకీయ ప్రయోజనాలు, ఆధిపత్య వర్గాల రక్షణ కోసం వాడుకుంటున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది.

నేడు రిజర్వేషన్ల వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ‘వక్రీకరణ’. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పేరుతో తీసుకొచ్చిన 10 శాతం రిజర్వేషన్లు వాస్తవానికి అగ్రవర్ణాల ప్రయోజనాలకే ఉపయోగపడుతున్నాయి. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాల్సిన ఓబీసీలకు మాత్రం సీలింగ్ పేరుతో తాళాలు వేశారు. రిజర్వేషన్ సీలింగ్‌ను బద్దలుకొట్టే రాజ్యాధికారం బీసీలు తమ ఓట్లతో ఆధిపత్య కులాలకు అధికారాన్ని అమాయకంగా అప్పగిస్తూనే ఉన్నారు.

చారిత్రక వివక్షను అనుభవించని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా, సామాజిక న్యాయం అనే మూలసూత్రమే దెబ్బతింటోంది. రిజర్వేషన్లు ఉద్యోగాలకు మాత్రమే కాదు.. రాజకీయాలు, వ్యాపారం, సంస్కృతి ఇలా అన్ని రంగాల్లో సమ ప్రాతినిధ్యం కల్పించడానికి ఉద్దేశించినవి. కానీ, నేటి పరిస్థితులు దానికి విరుద్ధంగా ఉన్నాయి. ఇది సాహు మహారాజ్, అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధం. ఎవరికి అవసరమో వారికి అందాల్సిన హక్కులు అందకుండా పోవడం సామాజిక అన్యాయానికి దారితీస్తుంది.

సాహు మహారాజ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే, బహుజన వర్గాలు జయంతి వేడుకలకే పరిమితం కాకూడదు. రిజర్వేషన్ల అమలులో లోపాలను ప్రశ్నించాలి. సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడాలి. అంబేద్కర్ ఉద్యమానికి సాహు మహారాజ్ ఎన్నో విధాల ఆర్థిక, నైతిక సహకారం అందించారు. అంబేద్కర్ దేశంలో లేని సమయంలో దళిత వర్గాల అభ్యున్నతికి సాహు మహారాజ్ చేసిన సేవలను చూసి అంబేద్కర్ స్వయంగా ఆయనను కొనియాడారు.

నిజమైన ప్రజాస్వామిక విలువల స్థాపన కోసం తుదికంటా పోరాడిన సాహు మహారాజ్ 1922 మే 6న కన్నుమూశారు. సామాజిక న్యాయం, సమాన అవకా శాల కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ, రిజర్వేషన్ల అసలు లక్ష్యం కోసం మనం ఐక్యంగా చర్చించాలి. ఈ జయంతిని సామాజిక న్యాయ పునరుద్ధరణకు ఒక సంకల్ప దినంగా మార్చుకుందాం.

డా.పర్వతం వెంకటేశ్వర్

 ఓబీసీ ఇంటెలెక్చువల్ పోరం కన్వీనర్, 9177566741