అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు
- 6 గంటలకు కోలా శంకర్‌గౌడ్ అంతిమయాత్ర ప్రారంభం
- ముత్తోజిపేటలో రాత్రి 7 గంటలకు అంత్యక్రియలు
మహబూబాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్‌కు వివిధ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ కార్మికులు, శంకర్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రజలు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. ఆయన అంత్యక్రియలను ముత్తోజిపేటలో శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయకుండా జాప్యం చేయడానికి నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా గురువారం వ రం గల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో నిరసన కార్యక్రమంలో పాల్గొని మనస్థాపానికి గురై న డ్రైవర్ కోలా శంకర్‌గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకొని ఆత్మార్పణం చేసుకున్నాడు.
తీవ్రంగా గాయపడ్డ అతన్ని తొలుత వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్సచేశారు. పరిస్థితి విష మించడం తో ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ ఏర్పా టు చేసి అంబులెన్స్‌లో హైదరాబాద్ కంచన్ బాగ్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాసవిడిచారు. శంకర్ పార్థివదే హాన్ని ప్రభుత్వం భారీ పోలీసు బందోబస్తు మధ్య శుక్రవారం ఉదయం నర్సంపేట మండలం ముత్తోజిపేటకు తీసుకువచ్చారు.
ఆయన పార్థివదేహాన్ని చాలాకాలం విధులు నిర్వహించిన నర్సంపేట డిపో వద్ద కొద్దిసేపు ఆత్మశాంతి కోసం ఉంచాలని విపక్ష పార్టీల నాయకులు, ఆర్టీసీ కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. దీంతో ఆయన అంత్యక్రియలు చేయడానికి ఆటంకంగా మారింది. చివరకు కుటుంబసభ్యులు, ఆర్టీసీ జేఏసీ నాయకులతో పోలీసులు చర్చలు జరిపి ముత్తోజిపేట లో అంత్యక్రియలు నిర్వహించడానికి అంగీకరింపజేశారు. దీనితో సాయంత్రం 6 గంటలకు ఆయన అంతిమయాత్ర నిర్వహించి, రాత్రి 7 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు పూర్తిచేశారు.
కుమారుడు హేమంత్ తండ్రి శంకర్ చితికి నిప్పంటించారు. దీంతో గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం రాత్రి వరకు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. శంకర్‌గౌడ్‌కు భార్య హేమలత, కూతురు షామిలి, కొడుకు హేమంత్ ఉన్నారు. అంత్యక్రియలో ఆర్టీసీ కార్మికులు, శంకర్ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.






