చిత్ర ప్రేమికులకు కానుక
ప్రేమికుల రోజు.. చిత్రసీమకు ఎంతో ప్రత్యేకం. అందుకే సోషల్ మీడియాలో వాలెంటైన్స్ డే స్పెషాలిటీ స్పష్టంగా కనిపించింది. ఔను, ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న సినిమా పోస్టర్లతో సామాజిక మాధ్యమాల్లో సందడి నెలకొంది. పలు చిత్రబృందాలు శుక్రవారం విడుదల చేసిన పోస్టర్లు సినీప్రియులను అమితంగా ఆకట్టుకున్నాయి.
పవన్ కల్యాణ్, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ నుంచి, సుమంత్ నటిస్తున్న ‘అనగనగా’ నుంచే కాకుండా మరికొన్ని చిత్రాల నుంచి విడుదలైన స్పెషల్ పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి.
రొమాంటిక్‌గా ‘ఓ భామ అయ్యో రామ’
యువ కథానాయకుడు సుహాస్ ఓ అందమైన ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘ఓ భామ అయ్యో రామ’ అనే ఈ సినిమాలో మలయాళ నటి మాళవిక మనోజ్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు రామ్ గోధల దర్శకత్వం వహిస్తున్నారు.
హరీశ్ నల్ల నిర్మాత. వాలెంటైన్స్ డే సందర్భంగా మేకర్స్ సుహాస్, మాళవిక మనోజ్‌ల రొమాన్స్ ఎలా ఉండబోతోందో చూపిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
సాంప్రదాయ చీరకట్టులో ‘కాంత’
బహు భాషా చిత్రం ‘కాంత’తో తన మెస్మరైజింగ్ ప్రజెన్స్‌తో అలరించడానికి సిద్ధంగా ఉంది మరాఠా బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ఇందులో ఆమె దుల్కర్ సల్మాన్ సరసన నటిస్తోంది. ప్రేమికుల దినోత్సవం కానుకగా చిత్ర నిర్మాతలు ఈ చిత్రం నుంచి ఆమె ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఈ చిన్నది సాంప్రదాయ చీరకట్టుతో క్లాసిక్ బ్యూటీగా కనిపించింది.
వేఫేరర్ ఫిల్మ్స్, సురేశ్ ప్రొడక్షన్స్, స్పిరిట్ మీడియా నిర్మాణంలో సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. 1950ల మద్రాస్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ -ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
మార్చిలో ‘నా లవ్ స్టోరీ’
మహీర క్రియేషన్స్, సుప్రియ ఆర్ట్స్ బ్యానర్లపై దొమ్మరాజు అమరావతి, శ్రీకాంత్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నా లవ్ స్టోరీ’. వినయ్ గోను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ‘ఆర్‌ఎక్స్ 100’ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి లాంచ్ చేశారు. మార్చి మొదటి వారం నుంచి తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు.
‘తెలుసు కదా’.. ముక్కోణ ప్రేమకథ!
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం న్యూ జనరేషన్ లవ్ స్టొరీ ‘తెలుసు కదా’లో నటిస్తున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధిశెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
వాలెంటైన్స్ డే సందర్భంగా మేకర్స్ శుక్రవారం సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. రాశి ఖన్నా సిద్ధు బుగ్గపై ముద్దు పెడుతూ చిరునవ్వులో కనిపిస్తుండగా, శ్రీనిధిశెట్టి అతని ముందు నిలబడి ఉండటం.. ఈ మూడు పాత్రల మధ్య బాండింగ్ గురించి ఆసక్తిని కలిగిస్తోంది. జ్ఞాన శేఖర్ బాబా డీవోపీ నిర్వహిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.






