బాలీవుడ్‌లో దక్షిణాదివారు కొనసాగడం కష్టం
ఇండస్ట్రీకి వచ్చిన 14 ఏళ్ల తర్వాత కానీ నటి రెజీనాకు బాలీవుడ్ పరిశ్రమలోకి అడుగు పెట్టేందుకు అవకాశం దొరకలేదు. ప్రస్తుతం ఆమె హిందీలో రెండు సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లో దక్షిణాది వారు కొనసాగే విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భాష రాకపోవడం వల్ల తానెన్నో అవకాశాలు కోల్పోయానని.. చాలా మంది విషయంలో ఇదే జరుగుతోందన్నారు. “నేను తొమ్మిదేళ్ల వయసు నుంచి నటించడం ప్రారంభించా. 25 ఏళ్లుగా ఎన్నో సినిమాలు, ప్రకటనల్లో నటిస్తున్నా. నాకు ఇండస్ట్రీపై అవగాహన ఎక్కువే. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో దక్షిణాది నటులు కొనసాగడం ఎంత కష్టమో కూడా తెలుసు. నేను ఆడిషన్ కోసం వచ్చినప్పుడు ముందుగా నా భాషాజ్ఞానాన్నే పరీక్షించారు. దక్షిణాదిలో అయితే భాష వచ్చా? రాదా? అనే విషయాన్ని అసలు పట్టించుకోరు. ఏ భాషకు చెందిన వారైనా ఇక్కడ కొనసాగుతారు. హిందీ సరిగా మాట్లాడలేకపోవడంతో ఎన్నో అవకాశాలు కోల్పోయా. నార్త్ హీరోయిన్లు వచ్చేసి సౌత్ సినిమాల్లో చక్కగా నటిస్తున్నారు” అని తెలిపింది.






