సురక్షిత మాతృత్వంతో ఆరోగ్యకరమైన సమాజం సాధ్యం
- టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి
తల్లిశిశు ఆరోగ్య పరిరక్షణకు సమిష్టి కృషి : జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): సురక్షిత మాతృత్వంతోనే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్ వీక్ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం మెడికల్ కళాశాల సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సేఫ్ మదర్ డే కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గర్భిణీలకు అవసరమైన ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించడంతో పాటు ఏఎన్సీ చెకప్లు మాతృ మరణాల రేటు తగ్గించడం సి-సెక్షన్, హై రిస్క్ గర్భధారణలు, అత్యవసర పరిస్థితులు, పీసీపీఎన్డీటీ చట్టం వంటి అంశాలపై డాక్టర్లకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హాజరయ్యారు.
నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ తల్లిబిడ్డల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వైద్య సదుపాయాలను అందిస్తున్నదన్నారు. గర్భధారణ ప్రారంభం నుంచే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, రక్తహీనత నివారణకు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ సురక్షిత ప్రసవాలు, తల్లిశిశు ఆరోగ్య పరిరక్షణకు వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమగ్ర ప్రణాళికతో పనిచేసి మాతృ మరణాల రేటును జీరోకు తీసుకురావడానికి కృషి చేయాలని తెలిపారు. కొత్తగా తల్లులైన మహిళలకు అవసరమైన జాగ్రత్తలపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
అలాగే పీసీపీఎన్డీటీ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సేఫ్ మదర్ హుడ్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వసంత్ రావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కవిత, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ నాగనిర్మల, డాక్టర్ శశాంక్, మెడికల్ ఆఫీసర్లు, గర్భిణీలు పాల్గొన్నారు.




