పెట్టుబడులకు లాక్‌హీడ్ సై
- తెలంగాణ పారిశ్రామిక విధానాలు ఆకర్షణీయం
- టీఎల్‌ఎంఏఎల్ ఎండీ టిమ్ రైఫిల్ వెల్లడి
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ
హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి) : తెలంగాణ పారిశ్రామిక ప్రగ తిలో సరికొత్త అధ్యాయం.. అంతర్జాతీ య ఏరోస్పేస్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్ (టీఎల్‌ఎంఏఎల్) లిమిటెడ్ కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టిమ్ రైఫిల్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు.
సచివాలయం లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రం లో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న పరిస్థితులు, నూతన ప్రాజెక్టుల స్థాపనపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో ఉన్న అత్యాధునిక మౌళిక సదుపాయాలు, పారిశ్రామిక విధానాలు తమను ఎంతగానో ఆకర్షించాయని టిమ్‌రైఫిల్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సి130జె సూపర్ హెర్క్యులస్ విమానాల ఫైనల్ అసెంబ్లీ లైన్‌ను లాక్‌హీడ్ మార్టిన్ భారత్‌లో ఏర్పాటుచేయబోతుంది.
గత కొన్నేళ్లుగా హైదరాబాద్ వేదికగా తమ సంస్థ కార్యకలాపాలు విజయవంతంగా సాగుతున్నాయని ఆయన వివరించారు. భవిష్యత్‌లో మరిన్ని భారీ ప్రాజెక్టులు ఇక్కడికి తీసుకురావడానికి ఆసక్తిగా ఉన్నట్లు సీఎం రేవంత్‌రెడ్డికి తెలిపారు. అంతర్జాతీయ రక్షణరంగ అవసరాల కోసం ఎఫ్-16 విమానాల రెక్కలను టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఉత్పత్తిచేసేందుకు లాక్‌హీడ్ మార్టిన్ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నది.
ఈ తయారీ కేంద్రం ద్వారా స్థానికంగా వందలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రక్షణ ఉత్పత్తుల తయారీలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా మార్చడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు కావాల్సిన అన్ని రకాల అనుమతులను వేగంగా మంజూరుచేస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సానుకూల నిర్ణయాలు, సింగిల్ విండో అనుమతుల ప్రక్రియ వల్ల విదేశీ పెట్టుబడిదారులు ఇక్కడికి రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.
ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాల్లో తెలంగాణ ఇప్పటికే దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందన్నారు. తాచా చర్చలతో మరిన్ని నూతన సాంకేతికతలు రాష్ట్రానికి వచ్చే మార్గం సుగమమైందన్నారు. ఇప్పుడు కేవలం విడిభాగాల తయారీకే పరిమితం కాకుండా పూర్తిస్థాయి విమానాల అసెంబ్లీ ఇక్కడ జరగడం వల్ల రాష్ట్ర ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా ఇనుమడిస్తుందన్నారు.
లాక్‌హీడ్ మార్టిన్ వంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టడం వల్ల అనుబంధంగా చిన్న తరహా పరిశ్రమలు కూడా అభివృద్ది చెందుతాయి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరుల వినియోగం పెరుగుతుంది. రాబోయే రోజుల్లో ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ మరిన్ని రికార్డులు సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది.




