ప్రేమపాఠం.. ప్రొఫెసర్‌పై దాడి!
వైరల్ గా మారిన వీడియో.. విచారణకు ఆదేశించిన హోంమంత్రి
బెంగళూరు: వైద్యవిద్యార్థినికి ప్రేమ ప్రతిపాదన చేసి ఆమెతో చెప్పుదెబ్బలు తినడమే గాకుండా, విద్యార్థుల చేతిలో చావు దెబ్బలు తిన్నాడో ప్రొఫెసర్. వివరాల్లోకి వెళితే కర్ణాటక బెంగళూరు రూరల్ నీలమంగళ తాలూకా టి. బేగూర్ లోని శ్రీ సిద్దార్థ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో వైద్య విద్యనభ్యసిస్తున్న ఓ విద్యార్థినికి ప్రొఫెసర్ ప్రేమ ప్రతిపాదన చేశాడు. విద్యార్థిని ప్రోఫెసర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెప్పుతో దాడి చేసింది.
దీన్ని గమనించిన తోటి విద్యార్థులు ప్రొఫెసర్ చర్యను నిలదీస్తుండగా, అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు ప్రొఫెసర్‌పై దాడి చేశారు. ఈ సంఘటననంతా అక్కడ ఉన్న వారు కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టడంతో వైరల్ గా మారింది. హోంమంత్రి డాక్టర్ పరమేశ్వర్ వరకు విషయం చేరడంతో ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. హోంమంత్రి ఆదేశాలతో పోలీసులు రంగ ప్రవేశం చేసి విచారణ చేపట్టారు.




