30 March, 2026 | 2:16 AM

అక్షరయాగం!

30-03-2026 12:00 AM

వేల వేల నామాల

ఇలవేల్పులయిన దేవయ్య దేవమ్మల్లారా

లింగ భేదాల పిలుపులే తప్ప

సమాన మంత్రధీమతులు మీరు !

      అభయ హస్తాల జెండాలను

      అజెండాలుగా అమలు జేసే మీరు

      యుద్ధ మతులతో

      జనం మెదళ్లని నింపుతున్నారెందుకు ?

బంధాల బంధువుల

బందీలను జేస్తున్నారు గానీ

శిరస్సుల నందలని బోధలతో 

నింపడం లేదెందుకు ?

బాధా ప్రవాహాలని అరికట్టడం లేదెందుకు ?

      పద్మవ్యూహ కోణాలతో

      క్రీడా వినోదం గావిస్తున్నారు గానీ

      క్రీనీడల ఛాయలని చెరిపేయడం లేదెందుకు ?

వేదనా ప్రార్థనల్లో

పూలూ ప్రదక్షిణలూ జపమాలలూ

ఏకచూపుతో అలంకరిస్తున్నా

ఏకాకులనిజేసి ఏడిపిస్తున్నారెందుకు?

      దేవయ్యలూ దేవమ్మలూ

      నుదుళ్లకి రక్త రేఖలని చిత్రిస్తున్నారెందుకు ?

      అరిషడ్వర్గాలని ఆరగించమని

      ఆయువులకి సెగవాయువులు 

      కమ్మిస్తున్నారెందుకు?

లక్షలక్షల అక్షర యాగాలు అర్పించినా

కటాక్ష కాంతులు విరజిమ్మరెందుకు?

కుమ్ములాటలు మోపు జేసి

శాంతి కరువులు నిలబెడుతున్నారెందుకు?

మనోనేత్రాలకి మోక్షజ్ఞానం కల్పించి

మానవీయ ముక్తి మానవుడిని నడిపించరెందుకు?