30 March, 2026 | 2:16 AM

కాలధర్మం

30-03-2026 12:00 AM

భద్రంగా దాచుకున్న బతుకు పాయసం

చేదుగా ఒలికిపోయేదొక్కసారే

నిలబడి కలబడే యుద్ధాలే

పదే పదే తారస పడతాయి

గుత్తులు గుత్తులుగా పూచిన గుల్‌మోహార్ పూలు

అత్యంత సహజంగా ప్రకృతి ధర్మంగా

నేలరాలి పోయినట్టు

మన నుంచి విస్తృతంగా విస్ఫోటనమవుతున్న

భావాలూ బాంధవ్యాలూ బాధ్యతలూ

ఒకానొక కాలంలో అసంకల్పితంగానే

స్థాన చలనమై పోతుంటాయి

ఎంతో ఆత్మీయంగా

గుండె కండెకు చుట్టుకున్న దారాలన్నీ 

చిక్కుముళ్లను విప్పుకొని

అలవోకగానే నిన్ను విదిల్చుకుంటాయి

ప్రయాణమెప్పుడూ

సాఫీగానే సాగుతుందని తలంచకు

నువ్వు వెళ్లే దారి విచ్చుకత్తుల వలయం కావొచ్చు

పృథ్వీతలం నీ తలంపుతో తరచూ ఏకీభవించదు

ఒకానొక సామ్రాజ్య కాంక్ష

భూగోళాన్నంతా కుదిపేయనూ వచ్చు

జీవన కుడ్యాలపై ఏర్పడిన బాధాప్త చిత్రాలతో

నీ కన్నులు జలార్ద్రమవ్వచ్చు

అనేకానేక వైరుధ్యాలను ధరించిన దృశ్యాలన్నీ

హాఠాత్తుగా మసక బారుతాయి

కంటక వృత్తాల మధ్య కదలాడటం

పాతాళ బిలంలోకి నేట్టివేయ బడటం

రెండూ ఒక్కటే..

అనుకున్నది అనుకున్నట్లు జరిగితే

దుఃఖాల ప్రసక్తే ఉండదు కదా !

ఈ ఉన్మత్త క్షేత్రంలో

కష్ట సుఖాలు బొమ్మా బొరుసులే

ఓ స్ఫురద్రూపీ !

కాలధర్మం తిరగేసి రాసుకునే చిత్తుప్రతి కాదు

నిషిద్ధాక్షరాలు అందులో వుండవు కాక వుండవు

అన్నింటినీ చదివేస్తూ.

అంతిమంగా ప్రస్థానం కాక తప్పదు !