బిర్యానీ తిని.. దవాఖాన పాలై
రంగారెడ్డి, మే 28 (విజయక్రాంతి): ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యతపై నిర్వాహకులు ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు కిచెన్‌లో శుచీ, శుభ్రత పాటించడం లేదు. ఆహారంలో రుచి పేరిట కల్తీ ద్రావణాలను వినియోగిస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. వరుసగా జిల్లాలో పలు రెస్టారెంట్లు, హోటళ్లపై ఫుడ్ సేప్టీ బృందం తనిఖీలు నిర్వహిస్తూ అధికారులపై చర్యలు తీసుకొంటున్నప్పటికీ వారిలో మార్పు రావడం లేదు. తాజాగా, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్ లో మండి బిర్యానీ తిని నరేందర్ అనే వ్యక్తి పుడ్‌పాయిజన్‌కు గురై దావాఖన పాలైన ఘటన వెలుగులోకి వచ్చింది.
రెండు రోజుల క్రితం పెళ్లి రోజును పురస్కరించుకొని అప్పారెడ్డి గూడ గ్రామానికి చెందిన నరేందర్ తన కుటుంబ సభ్యుల తో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడే కుటుంబ సభ్యులంతా కలిసి మండి బిర్యాని తిన్నారు. అనంతరం ఇంటికి చేరుకోగా.. బిర్యాని వికటించి బాధితుడు నరేందర్‌తో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు బాధితులను శంషాబాద్‌లోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. నరేందర్‌కు రక్తంతో కూడిన వాంతులు కావడంతో ఆయన ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
జిల్లాలో రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వహణ తీరును ఎండగడుతూ పలువురు సామాజిక మాధ్యమాలో సెటైర్లు వేస్తున్నారు. బిర్యానీ తినడానికి వెయ్యి రూపాయలు ఖర్చయితే దావాఖానలో చికిత్సకు లక్ష రూపాయల ఖర్చు అవుతుందని ప్రజలను హెచ్చరిస్తున్నారు.
శుభ్రత పాటించని హోటళ్లు..
పుడ్ సేప్టీ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహణ తీరు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తుంది. కిచెన్‌లో ఆహా రం తయారు చేసే విధానం, ఆహార నిల్వ చేయడం, టేస్ట్ కోసం వినియోగిస్తున్న టేస్టిం గ్ సాల్ట్‌ల వినియోగం ఇలా ఒక్కో విషయం బహిర్గతం అవుతుండటంతో వినియోగదారులు మండిపడుతున్నారు. వారాంతంలో సామాన్య, మధ్యతరగతి వారంతా కుటుంబ సభ్యులతో కలిసి హోట ళ్లు, రెస్టారెంట్ల బాట పడుతున్నారు. ఇదే విషయాన్ని గమనించిన హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు దీన్ని క్యాష్‌గా మలుచుకొని వ్యాపారం చేస్తున్నారు.
ఆహారం వండటం దగ్గరి నుంచి మొదలు వడ్డింపు విషయంలో నూ ఎక్కడా నాణ్యత పాటించకుండా ఇష్టా రితీలో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జిల్లాలో పలు హోట ళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు వరుస దాడులు చేసి తనిఖీలు నిర్వహిస్తుండటంతో రెస్టారెంట్ల నిర్వహణ తీరు బండారం వెలుగులోకి వస్తుంది. దీంతో, వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.






