ఎవరినీ ఇడువలే
ఫోన్లతో పాటు.. వాహనాలు ట్రాక్
హైకోర్టు జడ్డిల ఫోన్లు కూడా ట్యాపింగే
జర్నలిస్టులు, విద్యార్థి నాయకులపై నిఘా
యశోద, ప్రతిమ హాస్పిటల్స్ నుంచి టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో ఎన్నికల నగదు
బీఆర్‌ఎస్ లీడర్లకు పోలీసులే డబ్బు చేరవేత
అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న కన్ఫెషన్ స్టేట్‌మెంట్లలో కీలక అంశాలు ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రపంచమే విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. వీళ్లు, వాళ్లు అన్న తేడా లేకుండా ప్రభుత్వ పెద్దల కన్నుపడిన ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాప్ చేసినట్టు నిందితులు బయటపెడుతున్నారు. రాజకీయ నాయకులు, మీడియా పెద్దలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టులు, చివరకు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు ఎస్‌ఐబీ మాజీ అధికారులు తమ వాగ్మూలాల్లో వెల్లడిస్తున్నారు.
నాటి సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే ట్యాపింగ్ వ్యవహారం నడిచిందని ఎస్‌ఐబీ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు తెలుపగా, తాజాగా ఎన్నికల్లో ప్రతిపక్షాలను కట్టడి చేసి, బీఆర్‌ఎస్‌కు ఎలా సహకారం అందించారనే విషయాలను అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న తమ కన్ఫెషన్ స్టేట్‌మెంట్లలో వెల్లడించారు.
హైదరాబాద్ సిటీబ్యూరో/కరీంనగర్, మే 28 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలనాలు బయటకొస్తున్నాయి. నాటి సీఎం కేసీఆర్ కనుసన్న ల్లోనే రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశామని ఎస్‌ఐబీ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు తెలుపగా, బీఆర్‌ఎస్ ప్రభుత్వ వ్యతిరేకులు ఎవ్వరినీ వదలకుండా వెం టాడామని అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న తమ కన్ఫెషన్ స్టేట్ మెంట్లలో తెలిపారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వా న్ని మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకు ప్రతిపక్ష నేతల ఫోన్‌ట్యాపింగ్ ద్వారా వారి కదలికలను తెలుసుకొని కట్టడి చేశామని, కానీ ఎన్నికల్లో ప్రజా తీర్పు వ్యతిరేకంగా వచ్చిందని భుజంగరావు తెలిపాడు. ఈ కేసులో జ్యుడీషియల్ కస్టడీ రిమాండ్ ఖైదీగా ఉన్న భుజంగరావు దర్యాప్తు బృందానికి కీలక విషయా లు వెల్లడించారు. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు సహకారంతో ఫోన్‌ట్యాపింగ్ చేసినట్లు ఒప్పుకొన్నాడు. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసే వారందరి ఫోన్లు ట్యాప్ చేశామని.. అలాగే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థికంగా సాయపడేవారి ఫోన్లు కూడా ట్యాప్ చేసి వారిని కట్టడి చేశామని చెప్పాడు.
బీఆర్‌ఎస్‌లో ఉంటూ వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లతోపాటు ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబసభ్యులు, కొందరు హైకోర్టు జడ్జిలు (జస్టిస్ శరత్ కాజాతో పాటు మరికొందరు), న్యాయవాదులు, కుల సంఘాల నేతలు, విద్యార్థి నేతలు, జర్నలిస్టుల ఫోన్లను ఎస్‌వోటీ, టాస్క్‌ఫోర్స్ సహకారంతో ట్యాప్ చేసి వారి వ్యక్తిగత వివరాలు, కార్యకలాపాలు తెలుసుకోవడం ద్వారా తగిన సమయంలో కౌంటర్ ఇవ్వాలని కేసీఆర్ భావించేవారని భుజంగరావు చెప్పినట్లు సమాచారం.
తెరపైకి మరికొందరు పోలీస్ ఆఫీసర్లు
ఫోన్‌ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్, ఎస్‌వోటీ డీసీపీ నారాయణరెడ్డి పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఎన్నికలకు ముందు రాధాకిషన్‌రావు బదిలీతో ప్రభాకర్‌రావు సైబరాబాద్ ఎస్‌వోటీ టీమ్‌ను సంప్రదించారని భుజంగరావు తెలిపాడు. ఆ ఎస్‌వోటీ టీమ్ ద్వారా భారీగా నగదు తరలించామని చెప్పాడు. బీఆర్‌ఎస్ నేతలకు పోలీసులు స్వయంగా డబ్బు అందజేశారని వెల్లడించాడు. నవీన్‌చంద్ ఇచ్చిన అత్యాధునిక పరికరాలతో ఫోన్‌ట్యాపింగ్ చేశామని భుజంగరావు వివరించాడు.
అన్ని ఎన్నికల్లోనూ..
జీహెచ్‌ఎంసీ ఎన్నికలతోపాటు రాష్ట్రం లో జరిగిన మూడు ఉప ఎన్నికల సమయంలోనూ ఫోన్‌ట్యాపింగ్ చేశామని పోలీసులకు భుజంగరావు తెలిపాడు. హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో మునుగోడులో ఎలాగైనా బీజేపీని ఓడించాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని, దీంతో మునుగోడులో ప్రత్యేకంగా మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసుల మద్దతుతో ఆపరేషన్ చేపట్టి.. బీజేపీ, కాంగ్రెస్ మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేసి వారి ఆర్థిక వనరులపై దెబ్బ కొట్టామని వెల్లడించాడు.
యశోద, ప్రతిమ హాస్పిటల్స్ నుంచి డబ్బు తరలింపు
బీఆర్‌ఎస్ నేతల ఆదేశాలతో యశోద, ప్రతిమ హాస్పిటల్స్ నుంచి ఎన్నికలకు సంబంధించిన నగదును టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో తరలించామని భుజంగరావు చెప్పాడు. ఇందుకోసం ఓ ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా నేరుగా బీఆర్‌ఎస్ నేతలకు డబ్బు అందజేశామని తెలిపాడు. రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికకు ఇదేవిధంగా నగదు రవాణా చేసి బీఆర్‌ఎస్ విజయాలకు పరోక్షంగా దోహదం చేశామని, మాట వినని పోలీసు అధికారులకు ప్రమోషన్లు ఆశ చూపి పనిచేయించుకున్నామని వివరించారు.
సెటిల్‌మెంట్లు.. దందాలు..
బీఆర్‌ఎస్ నేతల సూచనలతో పలు సెటిల్‌మెంట్లు చేశామని భుజంగరావు అంగీకార పత్రంలో స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ ముఖ్య నేతల ఆదేశాలతో బడా కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తల వివాదాలను ఫోన్‌ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని సెటిల్ చేశామని తెలిపాడు. రియల్టర్ సంధ్య శ్రీధర్‌రావు రూ.13 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్లు కొనేలా చేశామని, మాట వినకపోతే క్రిమినల్ కేసులతో ఇబ్బంది పెడతామని హెచ్చరించామని చెప్పాడు. కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గెలుపు కోసం ప్రత్యేకంగా వెంకటరమణారెడ్డి, రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిపై నిఘా పెట్టామని వెల్లడించారు. పేపర్ లీకేజీలపై కేటీఆర్‌ను విమర్శించిన వారందరి ఫోన్లు ట్యాప్ చేసి, వారిని కట్టడి చేశామని భుజంగరావు చెప్పినట్లు సమాచారం.
తిరుపతన్న కన్ఫెషన్ స్టేట్‌మెంట్..
ఫోన్‌ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఆసరాగా చేసుకుని ప్రస్తుత ముఖ్యమంత్రి, మంత్రుల స్నేహితుల వద్ద పెద్ద ఎత్తున డబ్బును సీజ్ చేసినట్లు ఈ కేసులో మరో నిందితుడు తిరుపతన్న అంగీకరించాడు. అదనపు ఎస్పీ తిరుపతన్న వ్యవహారంపై పోలీసులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పలు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్, బీజేపీకి డబ్బు చేరకుండా అడ్డుకొన్నామని తిరుపతన్న తెలిపాడు. ‘పీవోఎల్ పేరుతో ప్రత్యేక ఎలక్షన్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని ప్రతిపక్ష పార్టీల సానుభూతి పరులపై దాడులు నిర్వహించి డబ్బులు సీజ్ చేసినట్లు పేర్కొన్నాడు.
ప్రణీత్‌రావు ఇచ్చిన సమాచారంతో 15 ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపాడు. ప్రతిరోజు 40 నుంచి 50 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టు, ఇలా మొత్తం 300 మంది ఫోన్లను ట్యాప్ చేశామని తిరుపతన్న కస్టడీ రిపోర్టులో వెల్లడించాడు. కొల్లూరులో రేవంత్‌రెడ్డి మిత్రుడు గాలి అనిల్‌కుమార్ నుంచి రూ.90 లక్షలు, రేవంత్ మరో మిత్రుడు కే వినయ్‌రెడ్డి నుంచి రూ.1.95 కోట్లు సీజ్ చేసినట్లు తెలిపాడు. ప్రస్తుత మంత్రులైన ఉత్తమ్, పొంగులేటి, కోమటిరెడ్డి డబ్బును పట్టుకున్నామని చెప్పాడు.
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ ఇన్‌ఫ్రా నుంచి రూ.10.5 కోట్లు సీజ్ చేయగా, పొంగులేటి మిత్రుడు ఖమ్మంలో ఫెర్టిలైజర్ సంస్థ యజమాని నుంచి రూ.10 లక్షలు సీజ్ చేసినట్లు పేర్కొన్నాడు. రాజగోపాల్‌రెడ్డి మిత్రుడు సీహెచ్ వేణు దగ్గర రూ.3 కోట్లు, ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ నుంచి రూ.50 లక్షలు, ఉత్తమ్ మిత్రుడు గిరిధర్ నుంచి రూ.35 లక్షలు, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డి నుంచి రూ.90 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతన్న కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో వెల్లడించాడు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో డాటా మొత్తం ధ్వంసం చేసినట్టు ఒప్పుకొన్నాడు. తిరుపతన్న తన దగ్గర ఉన్న 3 కంప్యూటర్లతోపాటు 9 లాగర్స్‌లో ఉన్న డాటా మొత్తం ధ్వంసం చేశాడని, దీంతో దశాబ్దాల తరబడి కష్టపడి సేకరించిన మావోయిస్టుల సమాచారం ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు.
నేడు భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై విచారణ
ఫోన్‌ట్యాపింగ్ కేసులో అరెస్టయిన భుజంగరావు, తిరుపతన్న నాంపల్లి కోర్టులో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. గతంలో వీరి బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. దీంతో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
హరీశ్‌రావు ఆదేశాలతో..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు నాటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావుతో ఓ టీవీ ఛానల్ జర్నలిస్ట్ శ్రవణ్ ప్రత్యక్ష సంబంధాలు కొనసాగించారని మరో నిందితుడు రాధాకిషన్‌రావు వెల్లడించారు. శ్రవణ్ ప్రత్యర్థి పార్టీల నాయకుల ఆర్థిక వనరుల గురించి ఎస్‌ఐబీకి సమాచారాన్ని అందజేశారని, అలాగే బీఆర్‌ఎస్ పార్టీని విమర్శించేవారికి వ్యతిరేకంగా ఆన్‌లైన్ ట్రోలింగ్ ప్రచారాల్లో ప్రణీత్ రావు బృందానికి సహాయం అందించారని తెలిపాడు.
ట్యాపింగ్ చేసిఉంటే గెలిచేవాళ్లమే: ఎమ్మెల్యే సంజయ్
ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చి ఉండేవాళ్లమని కోరుట్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. బీఆర్‌ఎస్‌కు ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధం లేదని తెలిపారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యాలయంలో జీవీ రామకృష్ణారావుతో కలిసి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా తెలంగాణలో లీకులు, సాకులు తప్ప సంక్షేమం లేదని విమర్శించారు. వడ్ల కొనుగోలులో స్కాములు, కమీషన్ల కోసం లిక్కర్ పాలసీ తప్ప ప్రజా సంక్షేమ పని ఒక్కటీ చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జువ్వాడి నర్సింగరావు ఫోన్ ట్యాపింగ్ అయితే, ఎన్నికల్లో ఆయన రెండోస్థానంలో ఎలా నిలుస్తారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే ఆధారాలు ప్రజలు ముందు పెట్టాలని సవాల్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ సిగ్గుచేటు: ఎమ్మెల్యే కవ్వంపల్లి
ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం సిగ్గుచేటని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శించారు. మంగళవారం కరీంనగర్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో నా పేరు చెప్పడం చాలా బాధ కలిగించింది.
సేవ చేయడానికే రాజకీయాలకు వచ్చాను. నా మిత్రులు, కుటుంబ సభ్యులతో మాట్లాడిన విషయాలు వేరేవారికి తెలిసి పీఏతోపాటు స్నేహితులను అనుమానించాల్సి వచ్చింది. ఫోన్లు ట్యాపింగ్ చేయడం దుర్మార్గమైన చర్య. ఈ విషయంపై సీఎం, డీజీపీని కలుస్తా. హైకోర్టులో పిటిషన్ వేస్తా’ అని తెలిపారు. ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని నీచ సంస్కృతికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం మంచిది కాదని అన్నారు.






