గంజాయి చాక్లెట్ల కలకలం
రూ.7 లక్షల విలువైన 1.65 కిలోల గంజాయి చాక్లెట్లు పట్టివేత
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 16 (విజయక్రాంతి) : నగరంలోని శేరిలింగంపల్లిలో ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో గంజాయి చాక్లెట్లు లభించడం కలకలం సృష్టించాయి. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, శనివారం రాత్రి శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ లక్ష్మణ్ గౌడ్, ఎస్సై సాయికిరణ్, డీటీఎఫ్ ఫోర్స్ సీఐ ప్రవీణ్, ఎస్సై శ్రీకాంత్‌తో పాటు పలువురు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.
ఈ క్రమంలో నెహ్రూనగర్ ప్రాంతానికి చెందిన బియాస్‌గుప్తా అనే వ్యక్తి ద్విచక్రవాహనాన్ని తనిఖీ చేయగా అతని వద్ద రూ.7 లక్షల విలువైన 1.65 కిలోల గంజాయి చాక్లెట్లు, 8 చార్మినార్ గోల్డ్ మునుక్క ప్యాకెట్లు పట్టుబడ్డాయి. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి చాక్లెట్లను పట్టుకున్న ఎక్సైజ్ సిబ్బందిని రంగారెడ్డి డిప్యూటీ కమినర్ దశరథ్, శంషాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్ కృష్ణప్రియలు అభినందించారు.
మరో 6.47 కిలోల గంజాయి పట్టివేత
హైదరాబాద్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు నిర్వహించి 6.47 కిలోల గంజాయిని పట్టుకున్నారు. హయత్‌నగర్ సీఐ శ్రీధర్, ఎస్సై జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో 5.07 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న ఆర్.తిరుపతి, ఆర్.సాయికిరణ్, సి.గణేష్, వీరమురళి అనే నిందితులపై కేసు నమోదు చేశారు. అప్పర్ దూళిపేట్‌లో పోలీసులు నిర్వహించిన దాడుల్లో ఇద్దరు మహిళల వద్ద నుంచి 1.4 కేజీల గంజాయిని పట్టుకుని వారిపై కేసు నమోదు చేశారు.






