26 May, 2026 | 4:44 AM

కుడకుడ స్థలం ఖతం!

17-06-2024 12:05 AM
  • అక్రమార్కుల చెరలో ప్రభుత్వ స్థలం

సర్వే నంబర్ 126లో అక్రమ కట్టడాలు

గుట్టలను తొలచి చేపడుతున్న నిర్మాణాలు

నిర్మాణాలు లేకుండానే ఇంటి నంబర్లు

అక్రమ పద్ధతిలో క్రమబద్దీకరణ

సర్వే 126లో పాగా వేసిన రియల్టర్లు

కళ్లకు గంతలు కట్టుకున్న అధికారులు

సూర్యాపేట, జూన్16 (విజయక్రాంతి): పేదలకు గుంట భూమి ఇవ్వాలంటే సవాలక్ష ప్రశ్నలు అడిగే అధికారులకు అక్రమార్కుల కబ్జాలకు అడ్డుపడే సమయం లేదు. గూడు లేని పేదలకు గుంట స్థలం పంచాలంటే చేతులురాని అధికారులు పెద్దలకు మాత్రం దొంగచాటున పట్టాలు చేస్తున్నారు. సూర్యాపేటకు కూతవేటు దూరంలో ఉన్న కుడకుడ  రెవెన్యూ సర్వే 126లో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ  స్థలాన్ని రియల్టర్లు కబ్జా చేస్తున్న అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి కబ్జా స్థలాల్లో వెలుస్తున్న కట్టడాలే నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.  

ఆక్రమిత స్థలాల్లో యథేచ్ఛగా నిర్మాణాలు

సూర్యాపేట జిల్లా కేంద్రానికి ఆనుకొని కుడకుడ గ్రామం ఉంది. గతంలో చివ్వెంల మండల పరిధిలో ఉన్న ఈ గ్రామాన్ని సూర్యాపేట మున్సిపాలిటీలో విలీనం చేశారు. గ్రామ రెవెన్యూ శివారు సర్వే నెంబర్ 126లో 98 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో సుమారు 25 శాతం గుట్టలు ఉండగా మిగతా భూమి నిర్మాణాలకు అనువుగా ఉంటుంది. ఇందులో సుమారు 15 ఎకరాల వరకు ప్రభుత్వ అవసరాలకు వినియోగించారు.  ఇంకా సుమారు 60 ఎకరాలు ఉంటుందని అంచనా.

కానీ ఇప్పుడు గుట్టలు మినహా గుంట భూమి ఖాళీగా కనపడేలా లేదు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండటమే కాకుండా సూర్యాపేట దంతాలపల్లి రహదారిపై ఉండటం వల్ల ఈ భూమిపై అక్రమార్కు కళ్లు పడ్డాయి. రహదారిని ఆనుకొని ఉన్న సుమారు 10 ఎకరాల భూమిని పేదల పేరుతో కొందరు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే ఇక్కడ వందలాది నిర్మాణాలు జరిగాయి. అయిన అధికారులు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సుమారు రూ. 300 కోట్ల విలువ చేసే భూమి కబ్జాకు గురైనా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. 

ప్రభుత్వ స్థలం అని బోర్డు పెట్టిన చోటే ఆక్రమణలు

ఆక్రమణలను అడ్డుకట్ట వేయడానికి అధికారులు తీసుకున్న చర్యలు ఏమైనా ఉన్నాయంటే ఇది ప్రభుత్వ స్థలం అని బోర్డు పెట్టడమే. అదే అక్రమార్కులకు అవకాశంగా మారింది. ప్రభుత్వ స్థలం అని బోర్డు ఉండటంతో కబ్జాకు పునాది పడింది. రోజుకో చోట రాత్రికి రాత్రే అక్రమ కట్టడాలు పుట్టుకొస్తున్నాయి. గుట్టలను సైతం తొలిచి నిర్మాణాలు చేపడుతున్నారు. 

రియల్ ఎస్టేట్ వ్యాపారుల పాగా

ఈ సర్వే నెంబర్‌లో ఒక్క ఎకరం భూమి సుమారు రూ.4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు విలువ చేస్తుంది. దీంతో సర్వే 126లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఓ రియల్టర్ వెంచర్ ఏర్పాటు చేశాడనే ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఖాళీ స్థలాలకు  దొంగ ఇంటి నెంబర్లను సృష్టించి జీవో 58, 59 ప్రకారం బీఆర్‌ఎస్ నేతలు పట్టాలు చేయించుకున్నట్లు తెలుస్తోంది.  అయినా అధికారులు నోరు మెదపరు. ఆక్రమణలను అడ్డుకోరు. అవినీతిమయంలో కూరుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు. కలెక్టర్ దృష్టిసారించి స్థలాన్ని పరిరక్షించాలని కోరుతున్నారు.