26 May, 2026 | 3:04 AM

1.64 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం

17-06-2024 12:10 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 16 (విజయక్రాంతి): నగరంలో మరోసారి గంజాయి కలకలం రేపింది. రెండు వేర్వేరు ఘటనల్లో సుమారు రూ.83 లక్షల విలువైన 1.64 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపిన వివరాల ప్రకారం.. భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు దాడులు నిర్వహించి 64 కిలోల గంజాయి పట్టుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన నిందితులు షేక్ పర్వేజ్, అబ్దుల్ రవూఫ్, మహమ్మద్ అన్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనంతో పాటు మూడు మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అలాగే హుమాయిన్ నగర్‌లో దాడులు నిర్వహించి రూ.51 లక్షల విలువైన క్వింటాల్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  కామారెడ్డికి చెందిన దారావత్ రవి, మహారాష్ట్రకు చెందిన సయ్యద్ బహదూర్, ఆనంద రామ్జీ కదామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక కారు, నాలుగు మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

295 గ్రాముల గంజాయి పట్టివేత

పటాన్‌చెరు, జూన్ 16: అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. పటాన్‌చెరు మండలం ముత్తంగి సమీపంలో బిహార్‌కు చెందిన పియూష్ కుమార్ అనే వ్యక్తి శనివారం రాత్రి గంజాయిని విక్రయిస్తుండగా పటాన్‌చెరు ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 295 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.