8 April, 2026 | 3:49 AM

రాష్ట్రానికే తలమానికం మోడల్ కాలనీ

08-04-2026 02:02 AM
  1. పారదర్శకంగా లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ
  2. తొలి విడతలో 1500 మంది లబ్ధిదారుల ఎంపిక 

యువత ఉపాధికి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌లు 

హుజూర్ నగర్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి 

సూర్యాపేట, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్ట సమీపంలో 116 ఎకరాల విస్తీర్ణంలో 2,160 సింగిల్ బెడ్ రూమ్ లతో నిర్మించిన మోడల్ కాలనీ తెలంగాణా రాష్ట్రానికే తలమానికం కానుందని రాష్ట్ర నీటిపా రుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.మంగళవారం హుజూర్ నగర్ లోని మోడల్ కాలనీని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, గృహ నిర్మాణ శాఖ అధికారుల కలిసి పనుల పురోగతిని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2011 లో ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో ప్రారంభించిన మోడల్ కాలనీ కోసం దేవాదాయ, ధర్మాదాయ శాఖ నుంచి అప్ప టి మార్కెట్ ధర చెల్లించి భూమి కొనుగోలు చేశామన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొత్తగా అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం మోడల్ కాలనీ పనులను ఉద్దేశ్య పూర్వకంగా అటకెక్కించడంతో ఇంతటి జాప్యం కలిగిందన్నారు.

అప్పటికే 90 శాతం పనులు పూర్తి అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని నాటి పాలకులు నిర్లక్ష్యం చేశారని, కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే పనులు వేగవంతం చేశామన్నారు. భూమి కొనుగోలుకు చేసిన వ్యయం మినహాయించి నిర్మాణానికే రూ 125 కోట్లు వెచ్చించడంతో పాటు మరో రూ.20 కోట్లు తాజాగా మంజూరు చేశామని వెల్లడించారు.

పదికోట్లతో మోడల్ కాలనీలో తెలంగాణా పబ్లిక్ స్కూల్, మరో పది కోట్లతో అంగడి వాడి కేంద్రం, కమ్యూనిటీ హల్, క్రీడా ప్రాంగణం, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాట్లతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ నెలాఖరుకి మోడల్ కాలనీ ప్రారంభోత్సవం ఉంటుందని, మొదటి విడతలో అధికారులు 1500 మంది లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తారన్నారు.

46 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు

జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి రూ.46 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేశామని  మంత్రి ఉత్తమ్ తెలిపారు. రామస్వామి గుట్ట వద్ద అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను సందర్శించి విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.ప్రస్తుతం 172 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో శిక్షణ తీసుకుంటున్నారన్నారు.

ఈ టెక్నాలజీ సెంటర్‌లో నిరుద్యోగ,  చదువుకున్న యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించడానికి ఉపయోగపడుతుందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి  ప్రతి విద్యార్థికి 2,000 చొప్పున స్కాలర్‌షిప్ ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. 14 కోట్ల రూపాయలతో ఐటీఐ భవనం కూడా నిర్మిస్తామని అన్నారు. ఐటీఐ భవన నిర్మాణ పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని  కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు.  

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన 

హుజూర్ నగర్ మార్కెట్ యార్డ్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. జిల్లాలో కొనుగోలు కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రతి కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మౌలిక సదుపాయాలైన త్రాగునీరు, క్లీన్ యంత్రాలు, ధాన్యం డ్రై వాష్ చేసే యంత్రాలు, తార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు.

అంతకుముందు మంత్రి క్యాంప్ కార్యాలయంలో 437 మందికి 1 కోటి 80 లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ ఎఫ్ చెక్కులు అందజేశారు. 259 మంది అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు అందించారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎస్పీ కే నరసింహ, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, మున్సిపల్ చైర్మన్ దొంత గాని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాధిక దేశ్ ముఖ్ తదితరులు పాల్గొన్నారు.