25 March, 2026 | 3:02 AM

బకాయిలు బండెడు!

25-03-2026 01:35 AM

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు పెండింగ్ గండం

బడుగుల చదువులకు భరోసా లేదు

  1. దాదాపు 8 కోట్లకు చేరుకున్న బకాయిలు
  2. ఆర్థిక భారంతో కుదేలవుతున్న విద్యావ్యవస్థ
  3. విడతలుగా విడుదల.. ప్రైవేట్ కాలేజీల పెదవి విరుపు
  4. విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): తెలంగాణలో ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిల సమస్య ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటు ఉన్నత విద్యారంగాన్ని కుదిపేస్తున్నది. ఫీజు రియింబర్స్ మెంట్ కింద విద్యాసంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు వేల కోట్లకు చేరుకోవడం తీవ్ర సంక్షోభంగా మారింది. 2023 ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభమైన పెండిం గ్, పూర్తి స్థాయి చెల్లింపులు జరగకపోవ డం, విడతల విధానంతో కొనసాగుతున్న చెల్లింపుల ఫలితంగా.. బకాయిలు ప్రతి ఏటా పెరుగుతూ ప్రస్తుతం రూ. 8 వేల కోట్లకు పైగా మోపయ్యాయి.

ఒకవైపు పాత బకాయిలు క్లియర్ కాకపోవడం, మరోవైపు ప్రతి ఏడాది కొత్త బిల్లులు చేరడం వల్ల బకాయిల నుంచి ప్రభుత్వం బయటపడలేని పరిస్థితి ఏర్పడింది. దీని ప్రభావం కేవలం ప్రభుత్వ ఖజానాపైనే కాకుండా, ప్రైవేట్ విద్యాసంస్థలను ఆర్థికంగా దెబ్బతీస్తూ, జీతాలు చెల్లించలేని పరిస్థితులకు తీసుకొచ్చింది. తద్వారా ఈ సంక్షోభంతో చివరికి లక్షలాది విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఫీజులు క్లియర్ కాకపోవడం తో సర్టిఫికెట్లు నిలిపివేత, పరీక్షలు, ప్లేస్‌మెంట్లలో ఇబ్బందులు వంటి సమస్యలు విద్యా ర్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పేరుకు పోయిన భారీ బకాయిలను క్లియర్ చేయాల్సిన అవసరం ఒకవైపు, పరిమిత ఆదా యంతో ఖర్చులను సమతుల్యం చేయాల్సి న బాధ్యత మరోవైపు ఉండటంతో, ప్రస్తు తం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఇదొక సవాల్‌గా మారింది. 

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్య    

2023--24 ఆర్థిక సంవత్సరం నుంచే మొదలైనట్లు విద్యాసంస్థల వర్గాలు చెబుతున్నాయి. ఆ ఏడాది నుంచి నిధుల విడుదలలో జాప్యం కారణంగా చెల్లింపుల వ్యవస్థ క్రమంగా దెబ్బతిన్నది. ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌ంట్ మొత్తంలో పూర్తిస్థాయి విడుదల జరగకపోవడం, కొంతభాగం మాత్రమే విడతలుగా ఇవ్వడం వల్ల మిగిలిన బకాయిలు తర్వాతి సంవత్సరానికి చేరాయి. ఈ విధంగా క్యారీ ఫార్వర్డ్ బకాయిలు పెరుగుతూ వచ్చి, కొద్ది కాలంలోనే భారీ స్థాయికి చేరుకున్నాయి.

ముఖ్యంగా 2023--24లో పెండింగ్ చెల్లింపులు గణనీయంగా పెరగడం, కొత్తగా చెల్లించాల్సిన బిల్లులు కూడా చేరడం, బడ్జెట్ కేటాయింపులు అవసరానికి తగ్గట్టు లేకపోవడం వంటి అంశాలు కలిసి సమస్యను మరింత క్లిష్టంగా మార్చాయి. దీంతో ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు నియంత్రణ తప్పి, మొత్తం వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితి కారణంగా ఇప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు పూర్తిగా ఆర్థిక ఒత్తిడిలో పడింది.

ఇప్పటికే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అప్పులపై వడ్డీలు, సంక్షేమ పథకాల అమలు వంటివి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై భారీ ఒత్తిడిని సృష్టిస్తున్నాయి. దీంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలకు ఒకేసారి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయడం కష్టసాధ్యంగా మారుతోంది. ఇక మరోవైపు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల అవసరం ఉండగా, అందుకు తగిన స్థిరమైన ఫండింగ్ మోడల్ లేకపోవడం సమస్యను మరింత క్లిష్టం చేస్తోంది.

ఫలితంగా ప్రభుత్వం విడతలుగా నిధులు విడుదల చేసే విధానాన్ని అనుసరిస్తోంది. అయితే ఈ విధానం తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తోంది గానీ, అసలు సమస్యను పూర్తిగా పరిష్కరించలేకపోతోంది. దీనికితోడు ప్రభుత్వం వెల్లడిస్తున్న బకాయిల గణాంకాలు, విద్యాసంస్థలు చెబుతున్న అంచనాల మధ్య వ్యత్యాసం ఉం డటం కూడా సమస్యను మరింత సంక్లిష్టం చేస్తోంది. అధికారికంగా బకాయిలు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతుండగా, కాలేజీలు మాత్రం వాస్తవ బకాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయని వాదిస్తున్నాయి. 

ఫీజు రీయింబర్స్‌మెంట్ పూర్తి చెల్లింపులు జరగకపోవడంతో విద్యాసంస్థలు తమ ఆర్థిక ప్రణాళికను సరిగ్గా రూపొందించుకోలేకపోతున్నాయి. ఎప్పుడు ఎంత నిధులు వస్తాయో తెలియకపోవడం వల్ల బ్యాంకు రుణాలపై ఆధారపడాల్సి వస్తోంది. జీతాలు, నిర్వహణ ఖర్చులు ప్లాన్ చేయడం కష్టమవుతోంది.

అయితే రియింబర్స్‌మెంట్ బకాయిల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం స్పష్టమైన గడువు పెట్టి పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయడం, ప్రతి ఏడాది అవసరానికి సరిపడా బడ్జెట్ కేటాయింపు, పారదర్శక చెల్లింపుల వ్యవస్థ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. విడతలుగా నిధుల విడుదల విధానం తాత్కాలిక ఒత్తిడిని తగ్గించినా, దీర్ఘకాలంలో సమస్యను మరింత సంక్షోభాన్ని కొనసాగించే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం.. 

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల పెరుగుదల ప్రభావం విద్యా సంస్థలపై తీవ్రంగా పడుతోంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సంవత్సరాల పాటు పెండింగ్‌లో ఉండటంతో, కాలేజీలు తీవ్రమైన ఆర్థిక ఒత్తి డిని ఎదుర్కొంటున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద చదివే విద్యార్థుల శాతం ఎక్కువగా ఉండటంతో, ఈ నిధులపై కాలేజీలు అధికంగా ఆధారపడుతు న్నాయి.

అధ్యాపకులు, సిబ్బందికి జీతా లు ఆలస్యంగా చెల్లించడం, విద్యా సదుపాయాల అభివృద్ధి నిలిచిపోవడం వం టి ఇతర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్య కేవలం ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక అంశం మాత్రమే కాదు. ఇది రాష్ట్రంలోని మొత్తం ఉన్నత విద్యా వ్యవస్థను కుదేలు చేస్తున్న సంక్షోభంగా మారింది. వెంటనే పరిష్కారం చూపకపోతే, దీని ప్రభావం దీర్ఘకాలం పాటు కనిపించే ప్రమాదం ఉంది.

తద్వారా చివరికి విద్యార్థుల భవిష్యత్‌పై అత్యంత తీవ్ర ప్రభావం చూపుతోంది. పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన లక్షలాది మంది విద్యార్థులు ఈ పథకంపై ఆధారపడి ఉన్నత విద్యను కొనసాగిస్తున్నారు. అయితే బకాయిల చెల్లింపుల్లో ఆలస్యం వారి భవిష్యత్తును అనిశ్చితిలోకి నెడుతోంది. ఫీజులు ప్ర భుత్వ నుంచి కాలేజీలకు అందకపోవడంతో, కొన్ని విద్యాసంస్థలు విద్యార్థు లపై ఒత్తిడి పెంచుతున్నాయి.

ఫీజులు క్లియర్ కాలేదనే కారణంతో సర్టిఫికెట్లు నిలిపివేయడం, సెమిస్టర్ పరీక్షలకు అనుమతిపై సందేహాలు, ప్లేస్మెంట్ల సమయంలో అవసరమైన పత్రాలు అందకపోవడం వంటి సమస్యలు విద్యార్థులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇక ఉన్నత విద్య లేదా విదేశీ విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకు ఈ పరిస్థితి మరింత ఇబ్బందిగా మారుతోంది. అవసరమైన డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల అవకాశాలు కోల్పోయే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి.

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిల సమస్య పరిష్కారం కాకపోతే, దీని ప్రభావం ఒక్క తరం విద్యార్థులపై మాత్రమే కాకుండా, రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రగతిపై కూడా దీర్ఘకాలికంగా పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పరిష్కారమెప్పుడు?

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి గతంలో తీవ్రంగా స్పందించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతో బ్లాక్‌మెయిల్ చేయడం సహించబోమని హెచ్చరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారిం ది. బకాయిల గణాంకాలపై కూడా సీఎం స్పందిస్తూ, కాలేజీ లు చెబుతున్నట్లు వేల కోట్ల బకాయిలు లేవని, వాస్తవానికి సు మారు 3,600 కోట్ల మేరకే పెం డింగ్ ఉందని స్పష్టం చేశారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం దశల వారీ గా చెల్లిస్తున్నదని చెప్పారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై వివరిస్తూ, ఆదాయం పరిమితంగా ఉండగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని, అందుకే ఒకేసారి మొత్తం బకాయిలు క్లియర్ చేయడం సాధ్యం కాదని తెలిపారు. అదే సమయంలో కొన్ని కాలేజీల యాజమాన్యాలపై ఆరోపణలు చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, నిబంధనలు పాటించడం లేదని, సమస్యను రాజకీయంగా మలుస్తున్నారని విమర్శించారు. అయితే తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశం ఇప్పుడు కేవలం ఆర్థిక సమస్యగానే కాకుండా, గట్టి రాజకీయ అంశంగా మారింది.

అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు ముదురుతున్నాయి. గత పాలనలోనే బకాయిలు భారీగా పేరుకుపోయాయని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది. తగిన బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం, చెల్లింపుల్లో ఆలస్యం జరగడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొంటోంది. అయితే ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మాత్రం బకాయిలను వెంటనే క్లియర్ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తోంది. విద్యార్థులు, కాలేజీలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందన తగిన స్థాయిలో లేదని ఆరోపిస్తోంది.

ఈ పరస్పర విమర్శల మధ్య అసలు సమస్య పరిష్కారం ఆలస్యం అవుతోంది. కాలేజీలు నిరసనలు చేపట్టడం, విద్యార్థుల్లో ఆందోళన పెరగడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సున్నితమైన అంశాన్ని రాజకీయంగా కాకుండా, విధానపరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు.

ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే పెండింగ్ బకాయిలకు సరిపడా నిధులు కేటాయించి, పారదర్శక చెల్లింపులు చేయడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్య వెనుక ఉన్నది లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు అనే విషయాన్ని గుర్తించి, ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.

విద్యార్థులకు ఎందుకు ఇవ్వరు.. 

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కంటే బీసీలకు ఎక్కువగా ఇబ్బంది ఉంది. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం బీసీ, క్రిస్టియన్ బీసీల వారీకి ఆయా కార్పొరేషన్ల నుంచి ఫీజు రీయింబర్స్ చేస్తున్నాయి. ఈ విషయంలో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ సమయానికి విడుదల చేస్తే సమస్య ఎందుకు వస్తుంది. ఇతర కార్యక్రమాలకు కావాలంటే అప్పు తెస్తారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కాంట్రాక్టర్ బిల్లు విడుదల చేసేందుకు అప్పు తెస్తారు. మరి విద్యార్థులకు ఎందుకు ఇవ్వరు.

సమయానికి నిధులు విడుదల చేస్తేనే కదా కాలేజీ యాజమాన్యాలు సరిగా చదువు చెప్పేది. విద్యార్థులకు సరైన చదువు అందకుండా 3 ట్రిలియన్ ఎకానమీ ఎలా సాధ్యమవుతుంది.. అందుకు ముందు విద్యా రంగాన్ని ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యార్థుల చదువుకు నిధులివ్వకుండా తల్లిదండ్రులను హింస పెట్టడం సరికాదు. ప్రకటనలు, సదస్సులంటూ ప్రభుత్వం చేస్తున్న నిరర్థక ఖర్చులను తగ్గించుకుని విద్యార్థుల స్కాలర్‌షిప్, రియింబర్స్‌మెంట్ చెల్లించాలి.

టీ చిరంజీవులురిటైర్డ్ ఐఏఎస్,

 మేధావుల ఫోరం చైర్మన్

బడా కాంట్రాక్టర్లకు నిధులు..  

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వలేక రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దాటవేస్తూ కుట్ర చేస్తున్నది. రెండున్నరేళ్లుగా ఎందుకు బకాయిలు చెల్లించడం లేదు. రీయింబర్స్‌మెంట్ అంశం లక్షలాది మంది విద్యార్థుల జీవితానికి సంబంధించిన సమస్య. ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి.

దీనిని పెట్టుబడి సహాయంగా చూడకుండా మానవ వనరుల అభివృద్ధి కోణం చూడాలి. ప్రపంచంతో పోటీ పడాలంటూ, విద్యార్థులకు ఫీజులు చెల్లించకపోతే ఎలా సాధ్యమవుతుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేవంటున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక రూ. 70 వేల కోట్లు బడా కాంట్రాక్టర్లకు విడుదల చేశారు. బడుగు విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్‌కు మాత్రం నిధులు లేవంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నది.

ఉన్నత విద్యకు దూరం చూస్తూ.. విద్యార్థులను పొమ్మనకుండా పొగబెడుతున్నది. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు పేద విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలంటే మనసు రావడం లేదు. సమస్య పరిష్కరించే వరకు వదిలిపెట్టం. అసెంబ్లీని ముట్టడిస్తం. కాంగ్రెస్ పీఠం కూల్చేదాకా పోరాటం చేస్తాం.

జాజుల శ్రీనివాస్ గౌడ్,

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు