౩ నెలల తర్వాత విద్యార్థిని మృతదేహానికి రీపోస్టుమార్టం
హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే కూతురు మృతి చెందిందని తల్లిదండ్రుల ఆరోపణ
ఆదిలాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందడంతో, సిబ్బంది నిర్లక్ష్య మే కారణమంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో మృతి చెందిన మూడు నెలల తర్వాత రీపోస్టుమార్టం చేసిన ఘటన జిల్లాలు చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాంసి మండల కేం ద్రానికి చెందిన విద్యార్థిని లిఖిత నిజామాబా ద్ జిల్లా పోచంపాడ్‌లోని సాంఘీక సంక్షేమ వసతి గృహంలో 8వ తరగతి చదువుతోంది.
ఐతే విద్యార్థిని గత డిసెంబర్‌లో అనారోగ్యంతో వసతి గృహంలో అస్వస్థతకు గురికాగా, అక్కడి సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించి బాలికను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. బాలిక చికిత్స పొందుతూ డిసెంబర్ 14న మృతి చెందింది. అయితే తమ కూతురు మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు వసతి గృహ అధికారుల నిర్లక్ష్యం కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ మూడు నెలలుగా కేసు నమోదు చేయకపోవడంతో ఇటీవల మృతురాలి తండ్రి లింగన్న నిజామాబాద్ పోలీసు కమీషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తమ కూతురుకు సోకి న కామెర్ల వ్యాధిని ముందస్తుగా గుర్తించకుం డా వసతి గృహ సిబ్బంది నిర్లక్ష్యం చేశారని తండ్రి ఆరోపించారు. తమ కూతురు మృతికి కారణమైన వారివై కఠిన చర్యలు తీసుకోవాల ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు కుటుంబీకుల అనుమతితో మృతదేహానికి రీపోస్టుమార్టం చేయాలని సీపీ ఆదేశించారు. దీంతో మంగళవారం బాలికను ఖననం చేసిన ప్రాంతంలో జేసీబీ తో మట్టిని తొలగించి బాలిక మృతదేహానికి వెలికి తీసి, తల్లిదండ్రులు, అధికారుల సమక్షంలో వైద్యులు రీపోస్టుమార్టం చేశారు. ఈ ప్రకియలో తాంసి తహసీల్దార్ లక్ష్మి, ముప్కాల్ ఎన్.ఐ సుహాసిని, వైద్యులు అంకిత్ రావు, అరవింద్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.




