29 August, 2026 | 6:23 PM

బడులకు కొత్త రూపు

21-05-2024 01:12 AM

ప్రైవేటు స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతాం 

అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా అభివృద్ధి 

స్కూళ్ల అభివృద్ధికి ౬౦౦ కోట్లు విడుదల

మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో కమిటీ 

సన్న వడ్లకే రూ.500 బోనస్ ఇస్తం

తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొంటాం

ధాన్యం కొనుగోలు బాధ్యతలు కలెక్టర్లకు 

నకిలీ విత్తనాలు అమ్మేవారిపై ఉక్కుపాదం 

రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియాకు ఆహ్వానం

ఎన్డీఎస్‌ఏ సూచనల మేరకు కాళేశ్వరం మరమ్మతులు 

మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు 

౩ గంటలపాటు సాగిన క్యాబినెట్ భేటీ

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): వ్యవసాయం, విద్య, ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలే రాష్ట్రప్రభుత్వానికి ప్రాధాన్యతాంశాలని రాష్ట్ర మంత్రి వర్గం ప్రకటించింది. విద్యారంగం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నట్టు తెలిపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దుతామని వెల్లడించింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జరిగింది.

దాదాపు మూడు గంటలపాటు సాగిన సమావేశంలో పాఠశాలల అభివృద్ధి, ధాన్యం కొనుగోళ్లు, కాళేశ్వరం బరాజ్‌లకు రిపేర్లు తదితర అంశాలపై చర్చించింది. సమావేశంతో తీసుకొన్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాకు వెళ్లడించారు. జూన్ 12వ తేదీన పాఠశాలల పునఃప్రారంభం అయ్యేనాటికి సకల సౌకర్యాలు కల్పిస్తామని పొంగులేటి తెలిపారు. సుమారు రూ. 600 కోట్లతో గ్రామాల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే అడ్వాన్స్‌గా రూ.120 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.

రాబోయే 30 రోజల్లో స్కూళ్లను మోడ్రన్ పాఠశాలలుగా తీర్చిదిద్దుతామని చెప్పా రు. నాణ్యమైన విద్యకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. స్కూళ్ల అభివృద్ధిపై మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో కమిటీ వేసినట్లు చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను విస్మరించిందని విమర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక సదు పాయాలు కల్పించేందుకు అధిక ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించినట్లు వెల్లడిం చారు. రాబోయే కాలంలో విద్యావ్యవస్థలో మెరుగైన మార్పును  చూపెడుతామని చెప్పారు.

సన్న వడ్లకు బోనస్

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో రైతులు పండించే సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ.౫౦౦ బోనస్ ఇస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. యాసంగిలో 36 లక్షల టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు సేకరించారని, వాటికి సంబంధించిన డబ్బును మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో గత పది రోజులుగా అకాల వర్షాలు పడుతుండటంతో ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిచోట్ల ధాన్యం తడిసిపోయిందని చెప్పారు. ఈ తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకే కొనుగోలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించినట్టు వివరించారు.

రైతులు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని ఎంఎస్‌పీ ధరకు రూపాయి తగ్గకుండా కొంటామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది హాస్టల్స్ నిర్వహణ, మధ్యాహ్న భోజనంతోపాటు రూ.2లకే కిలో బియ్యం అమలు చేయాలంటే 36 లక్షల టన్నుల బియ్యం అవసరమని తెలిపారు. రాష్ట్రానికి అవసరమైన సన్న బియ్యాన్ని ఇతర రాష్ట్రాల నుంచి కొనకుండా తెలంగాణలోనే పండించిన సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించారు. సన్నరకాలు ఏవి పండిస్తే బోనస్ వస్తుందన్నది వ్యవసాయ శాఖ మంగళవారం వెల్లడిస్తుందని వివరించారు. 

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని పొంగులేటి హెచ్చరించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఎరువులు, విత్తనాలను రిజిస్టర్డ్ కంపెనీల వద్దనే కొనుగోలు చేయాలని, పంట చేతికొచ్చేవరకు కొనుగోలు రిసిప్టులను రైతులు తమవద్దే జాగ్రత్తగా ఉంచుకోవాలని మంత్రివర్గం సూచించినట్లు చెప్పారు. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించాలని అధికారులు సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

 మాకు మూడే ప్రధానాంశాలు:  శ్రీధర్‌బాబు

తమ ప్రభుత్వానికి వ్యవసాయం, విద్య, ఎన్నికల హామీలే ప్రధానాంశాలని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకొంటున్నట్టు చెప్పారు. గతంలో మాదిరిగా రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉండటం లేదని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లలో కుంగిన పిల్లర్ల ఎలా ముందుకెళ్లాలనే అంశంపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఎప్పటికప్పుడు ఎన్డీఎస్‌ఏ అధికారులతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. గతంలో సాంకేతిక నిపుణులు చెప్పింది వినకపోవడం వల్లే మూడు బరాజ్‌లు కుంగిపోయాయని అన్నారు. మరోసారి ఆ తప్పు జరగకుండా ముందడుగు వేయనున్నట్లు వెల్లడించారు.  

రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్: వెంకట్‌రెడ్డి

తమది రైతు పక్షపాత ప్రభుత్వమని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. కొన్నిచోట్ల అకాల వర్షాలవల్ల  ధాన్యం సేకరణ ఆలస్యమవుతుందని చెప్పారు. పదిరోజుల్లో ధాన్యం సేకరణ పూర్తిచేయాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు రూ.లక్ష రుణమాఫీని 8 విడతల్లో చేసిందని గుర్తుచేశారు. తాము అలా కాదని, ఆగస్టు 15లో ఒకే దఫాలో రుణమాఫీ చేయబోతున్నట్లు చెప్పారు.

పరిశీలన తర్వాతే బరాజ్‌లకు రిపేర్లు 

కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల మరమ్మతులకు సంబంధించి నేషనల్ డ్యాం సెఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) ఇచ్చిన మధ్యంతర నివేదికలోని సూచనలను అమలుచేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. మూడు బరాజ్‌ల గెట్లను పూర్తిగా తెరిచే ఉంచాలని, చుక్క నీరు కూడా ఆపొద్దని నివేదికలో ఉన్నదని చెప్పారు. బరాజ్‌లకు పరీక్షలు పూర్తయ్యేవరకు ఎలాంటి మరమ్మతులు చేయొద్దని ఎన్డీఎస్‌ఏ సూచించినట్లు వెల్లడించారు. బరాజ్‌లను పరీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఉన్న మూడు సంస్థలను ఎన్డీఎస్‌ఏ సూచించినట్లు పొంగులేటి చెప్పారు.

ప్రతి బరాజ్‌ను రెండు సంస్థలతో పరీక్షలు చేయించాలని ఎన్డీఎస్‌ఏ సూచించిందని, ఆ సంస్థల సూచనల మేరకు రిపేర్ చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందని పేర్కొన్నారు. ఎన్డీఎస్‌ఏ సూచనలను అనుసరిస్తూ.. రిస్క్ లేకుండా కాళేశ్వరం నుంచి నీళ్లను లిఫ్ట్ చేయొచ్చా? లేదా? అనే అంశాలను పరిశీలించాలని అధికారులను క్యాబినెట్ ఆదేశించినట్లు చెప్పారు. ఎల్ అండ్ టీకి తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చినవారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


సోనియా, ఉద్యమకారులకు 

సన్మానం

జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్త వుతున్నందున ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తొలిసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతోపాటు తెలంగాణ ఉద్యమకారులను పిలిచి సన్మానించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అందుకు అనుమతి కోరు తూ సీఈసీకి లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రైతుల పట్ల బీఆర్‌ఎస్ మొసలి కన్నీరు కారుస్తోందని ఆయన విమర్శించారు.