29 August, 2026 | 7:17 PM

ధాన్యం కొనేదెప్పుడు?

21-05-2024 01:04 AM

ముఖ్యమంత్రి, మంత్రుల హామీలు ఉత్తుత్తివేనా? 

39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు 30 రోజుల్లో సాధ్యమేనా? 

నెల రోజుల నుంచి కేంద్రాల్లో రైతులు పడిగాపులు

వానకాలం సమీపిస్తున్నా యాసంగి ధాన్యం కేంద్రాల్లోనే

ఇప్పటివరకు టార్గెట్ పూర్తిచేయని ప్రభుత్వం

హైదరాబాద్, మే ౨౦ ( విజయక్రాంతి):  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సహా మంత్రులు  చెప్పినట్లు రాష్ట్రంలో పండించిన చివరి గింజను కొనుగోలు చేయడానికి మరో 30 నుంచి 35 రోజుల సమయం పడుతుంది. రైతుల నుంచి ధాన్యం సేకరించాల్సిన సమయం దగ్గర పడుతున్నా, ఒక పక్క ఆకాల వర్షాలు కురుస్తున్నా అధికారులు నిర్లక్ష్య దోరణి స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దు మొలకెత్తినా పౌరసరఫరాల శాఖ సిబ్బంది అటు వైపు ఇప్పటివరకు కన్నెత్తి చూడలేదు.

పంటను కొనుగోలు చేయాలని అన్నదాతలు కేంద్రాల వద్ద నెల రోజుల నుంచి పడిగాపులు పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. తూకం వేసే నిర్వాహకులు తేమ శాతం తక్కువ, తాలు ఉందని సాకులు చూపుతూ కేంద్రాల్లోనే ధాన్యం ఉండేలా కుట్రలు చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ జీవితాలు అంధకారంలో పడ్డాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యాసంగిలో పండించిన పంటను వానకాలం సీజన్ వస్తున్నా ఇంకా కొనుగోలు చేయని పరిస్థితి ఉందంటే రాష్ట్రంలో రైతులపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ది ఉందో బయటపడిందని విపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల పోరులో ప్రభుత్వం పెద్దలు ఉండగా, అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నామని చెబుతూ 45 రోజుల్లో కేవలం 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 

టార్గెట్ పూర్తి చేయని పౌరసరఫరాల శాఖ

ప్రభుత్వ టార్గెట్ ఈఏడాది 75 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా,  మిగతా 39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ఎప్పుడు చేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. సగటున రోజుకు లక్ష మెట్రిక్ టన్నులు సేకరిస్తుండగా పూర్తిగా కొనుగోలు చేయాలంటే ఇంకా నెల రోజులు పడుతుంది. మరో వైపు పౌరసరఫరాల అధికారులు ప్రస్తుతం కొనుగోలు చేసిన వడ్లకే రైతులకు డబ్బులు చెల్లించేందుకు అనేక ఇబ్బందులు పడ్డామని, మిగతా ధాన్యం కొనుగోలు చేసేందుకు సరిపడా నగదు తమవద్ద లేదని వ్యాఖ్యానిస్తున్నారు.

వడ్లు తూకం వేయకుండా నిలిచిపోవడానికి ఇది కూడా ఒక కారణమని చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు 7,166 కేంద్రాల్లో  రూ. 6,750 కోట్ల విలువైన ధాన్యాన్ని  5.10 లక్షల మంది రైతుల వద్ద కొనుగోలు చేసింది. సూర్యాపేట, నల్లగొండ, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కొనుగోలు పూర్తవగా, కరీంనగర్, హన్మకొండ, మెదక్, సిద్దిపేట, జగిత్యాల, సిరిసిల్ల, జనగాం, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వనపర్తి, గద్వాల జిల్లాలో సగం వరకు సేకరణ జరిగింది.

ఈ జిల్లాల్లో వర్షాలతో ధాన్యం సేకరణ నిలిపివేశారు. దీంతో గత వారం రోజుల నుంచి రైతులు కేంద్రాల వద్ద  నిరసనలు తెలపడంతో వారికి బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల నేతలు మద్దతు పలుకుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక సర్కారు అని విమర్శలు గుప్పిస్తున్నారు. రైతుల నుంచి ధాన్యం సేకరించే వరకు ఊరుకోమని తడిసిన, రంగు మారిన ధాన్యం మొత్తం తీసుకోవాలని ఆ పార్టీలు డిమాండ్ చేశాయి.

కేంద్రాల్లో వడ్లు వదిలేస్తాం: అన్నదాతలు

రాష్ట్రంలో ఇప్పటివరకు ఇలా రైతులు అనేక ఇబ్బందులకు గురైన పరిస్థితి లేదు. గత కేసీఆర్ పాలనలో ఆలస్యమైనా కొనుగోలు కేంద్రాల్లో 15 రోజుల్లో వడ్లను అమ్ముకున్నామని అన్నదాతలు పేర్కొంటున్నారు. వారం రోజల్లోగా ధాన్యం తీసుకోకపోతే కేంద్రాల్లో వడ్లు వదిలేసి పోతామని కంటతడి పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుందని భావించి గెలిపిస్తే అన్నదాతలంటే లెక్క చేయడం లేదని మండిపడుతున్నారు. వానాకాలం పంటకు భూములు చదును చేసుకోవాల్సిన రైతులు ధాన్యం రాశుల వద్ద కాపలా ఉండే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

* ఈ ఏడాది యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. పండించిన ప్రతి గింజను సకాలంలో కొనుగోలు చేస్తాం. కనీస మద్దతు ధర అందించి అన్నదాతలను ఆదుకుంటాం. విపక్ష పార్టీల నేతల మాయమాటల్ని రైతులు ఎప్పటికీ నమ్మవద్దు. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మకై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేలేదు. 

 వరంగల్ ఎన్నికల సభలో  సీఎం రేవంత్‌రెడ్డి 

* రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి వరి గింజను కొనుగోలు చేస్తాం. అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన వడ్లు పూర్తిగా సేకరిస్తాం. అధికారులు ఎలాంటి కొర్రీలు పెట్టకుండా త్వరగా కొనుగోలు చేయాలి.  సమయం తక్కువగా ఉందని వీలైనంత త్వరగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలి.

 అధికారుల సమీక్షలో మంత్రి తుమ్మల 

* కల్లాల్లో తడిసిన ప్రతి ధాన్యపు గింజను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేస్తుంది. రాష్ట్రంలోని రైతులు అధైర్యపడ్డవద్దు. కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చాం. ఇక నుంచి ప్రభుత్వమే పంటలకు బీమా ప్రీమియం చెల్లిస్తుంది.

 రాయబలేరి నుంచి మంత్రి సీతక్క ప్రకటన

* రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి. రైతులు పండించిన ప్రతి వరి గింజను సర్కారు కొనుగోలు చేస్తుంది. విపక్షాల మాటలు రైతులు నమ్మవద్దు. ఆలస్యమైనా మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం.

 ఖమ్మం ఎన్నికల సభలో మంత్రి పొంగులేటి 

* కొన్నిచోట్ల ఆకాల వర్షాలకు పంట సేకరణ ఆలస్యమైంది.  పది రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు ఏమి చేసిందో అందరికీ తెలుసు.

 క్యాబినెట్ సమావేశానంతరం 

మంత్రి కోమటిరెడ్డి