అమ్మకోసం ఒక మొక్క
- మన్‌కీ బాత్‌లో ప్రధాని మరో కొత్త పిలుపు
- మూడోసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి మన్‌కీ బాత్
- అరకు కాఫీ గురించి ప్రధాని ప్రస్తావన
న్యూఢిల్లీ, జూన్ 30: భారత ప్రధాని మోదీ ప్రతి నెలలో చివరి ఆదివారం నిర్వహించే మన్‌కీ బాత్ రేడియో కార్యక్రమాన్ని నిర్వహించారు. మన్‌కీ బాత్‌లో మోదీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరు మీద ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. “ఏక్ పేడ్ మాకే నామ్” అనే కొత్త ప్రచారాన్ని ప్రారంభించారు. తాను కూడా తన తల్లి పేర మొక్కను నాటినట్లు తెలిపారు.
బెంగళూరు పార్కు గురించి ప్రస్తావన
మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ బెంగళూరులోని ఓ పార్కు గురించి ప్రస్తావించారు. బెంగళూరు నగరంలో ఉన్న కబ్బన్ పార్కులో ప్రజలు కొత్త సాంప్రదాయానికి తెరతీశారని తెలిపారు. ప్రతి ఆదివారం ఈ పార్కులో పిల్లలు, యువకులు, పెద్దలు అందరూ సంస్కృతంలోనే మాట్లాడతారని ఇది చాలా గొప్ప విషయం అన్నారు.
ఆ దేశంలో విగ్రహం గర్వకారణం
గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ 300వ జయంతి సందర్భంగా మేలో తుర్కెమెనిస్తాన్ దేశంలో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషదాయకమని మోదీ తెలిపారు. ప్రపంచంలోని 24 మం ది అత్యుత్తమ సాహిత్యకారుల విగ్రహాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్‌ది ఉండడం గౌరవసూచకంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
కువైట్ ప్రభుత్వానికి ధన్యవాదాలు
ప్రధాని మోదీ కువైట్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కువైట్ నేషనల్ రేడియోలో హిందీ భాషలో స్పెషల్ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉంద న్నారు. ప్రతి ఆదివారం అరగంట పాటు కువైట్ నేషనల్ రేడియోలో ఇది ప్రసారం అవుతుందని పేర్కొన్నారు. మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ దేశ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మరోసారి పట్టం కట్టారని.. రాజ్యాంగం మీద నమ్మకం ఉంచారని అన్నారు.
జీ-20లో అరకు కాఫీదే హవా..
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్యక్రమంలో అరకు కాఫీ గురించి ప్రస్తావించారు. అరకు కాఫీ ఉత్పత్తిలో దాదాపు 1.5 లక్షల గిరిజన కుటుంబాలు మిళితం అయి ఉన్నాయి. కొండ ప్రాంతాల నుంచి అరకు కాఫీని సేకరించడంలో గిరిజన్ కో ముఖ్యభూమిక పోషిస్తుందని ఆయన తెలిపారు. కాఫీని టేస్ట్ చేసే అవకాశం తనకు ఒకసారి వైజాగ్‌లో వచ్చిందని మోదీ గుర్తు చేసుకున్నారు. అరకు కాఫీ ఇప్పటి వరకు ఎన్నో అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుందని, మొన్న ఢిల్లీలో జరిగిన జీd20 సదస్సులో అరకు కాఫీ ఎంతో ఆదరణ పొందిందని తెలిపారు.
వీక్షించిన ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు
ఆదివారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో సీఎం మోహన్ చరణ్, కేంద్ర మంత్రులు ధర్మేంద్రప్రధాన్, అశ్విని వైష్ణవ్, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.
అలా వారిని ఎంకరేజ్ చేయండి
త్వరలో జరగబోయే పారిస్ ఒలంపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లె ట్ల గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. వారు దాదాపు 900 అంత ర్జాతీయ పోటీలలో పాల్గొంటున్నారని తెలిపారు. వారిని ‘చీర్4భారత్’ అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా మోటివేట్ చేయాలన్నారు.






