కొత్త సైన్యాధిపతిగా ఉపేంద్ర ద్వివేదీ
- కొత్త సైన్యాధిపతిగా ఉపేంద్ర ద్వివేదీ
- ఆదివారం బాధ్యతల స్వీకరణ
- జనరల్ మనోజ్ పాండే స్థానంలో నియామకం
న్యూఢిల్లీ, జూన్ 30: భారత్ సైన్య కొత్త అధ్యక్షుడిగా జనరల్ ఉపేంద్ర ద్వివేదీ బాధ్యతలు స్వీకరించారు. జనరల్ మనోజ్ పాండే పదవీ కాలం ముగియటంతో ద్వివేదీని కొత్త సైన్యాధ్యక్షుడిగా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ద్వివేదీకి పాండే బాధ్యతలు అప్పగించారు. జనరల్ ఉపేంద్ర ద్వివేదీకి పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉన్నది. 2022 నుంచి ఇప్పటివరకు నార్తర్న్ కమాండ్‌కు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా పనిచేశారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులను ఏరివేయటంలో కీలక పాత్ర పోషించారు.
సైన్యానికి కొత్తదనాన్ని అద్దిన జనరల్
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జనరల్ ద్వివేదీ రెవాలోని సైనిక్ స్కూళ్లో విద్యనభసించారు. 1981లో నేషనల్ డిఫెన్స్ కాలేజీలో చేరారు. 1984లో ఆయన జమ్ముకశ్మీర్ రైఫిల్స్ 18వ బెటాలియన్‌లో తొలి ఉద్యోగం పొందారు. ఆ తర్వాత అదే బెటాలియన్‌కు కశ్మీర్, రాజస్థాన్‌లో ఆయన నాయకత్వం వహించారు. సైన్యాన్ని ఆధునీకరించటంలో ద్వివేదీ కీలక పాత్ర పోషించారు. సైన్యానికి దేశీయంగా తయారుచేసిన అత్యాధునిక ఆయుధాలను అందించటానికి కృషి చేశారు. సీషెల్స్‌కు ప్రభుత్వానికి సైనిక సలహాదారుగా పనిచేశారు. సోమాలియాలో కూడా పనిచేశారు.
ఇద్దరు మిత్రులు
భారత త్రివిధ దళాల్లో ఇప్పుడు ఓ అరుదైన సన్నివేశం కనిపిస్తున్నది. రెండు ప్రధాన విభాగాలకు చిన్ననాటి మిత్రులు అధిపతులుగా ఉన్నారు. సైన్యాధిపతిగా జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ఆదివారం బాధ్యతలు స్వీకరించగా, ఆయన చిన్ననాటి మిత్రుడు దినేశ్ త్రిపాఠి ప్రస్తుతం భారత నౌకాదళ అధిపతిగా కొనసాగుతున్నారు. వీరిద్దరూ మధ్యప్రదేశ్‌లోని రెవా సైనిక్ స్కూళ్లో ఐదో తరగతిలో క్లాస్‌మేట్స్ కావటం విశేషం. క్లాస్ 5ఏ సెక్షన్ విద్యార్థులైన వీరి రూల్ నంబర్లు వరుసగా 931, 938.






