10 June, 2026 | 1:33 AM

దేశ భక్తిని పెంపొందించే ప్రతిజ్ఞ

10-06-2026 12:00 AM

‘భారతదేశం నా మాతృభూమి’ అంటూ సాగే ప్రతిజ్ఞ మన దేశంలోని ప్రతీ ఒక్కరిలో దేశభక్తిని పెంపొందిస్తుంది. దేశం పట్ల అభిమానాన్ని చాటుకునేందుకు దోహదపడే, అందరిలోనూ స్ఫూర్తి నింపే ఈ ప్రతిజ్ఞను మన తెలంగాణకు చెందిన పైడిమర్రి వెంకటసుబ్బారావు రచించడం విశేషం.

1916 జూన్ 10న నల్లగొండ జిల్లా, అన్నెపర్తిలో రాంబాయమ్మ, వెంకవూటామయ్య దంపతులకు జన్మించిన పైడిమర్రి వెంకటసుబ్బారావు గొప్ప రచయిత, బహుభాషావేత్త. ఆయన విద్యాభ్యాసం అన్నెపర్తి, నల్లగొండలోనే సాగింది. తెలుగు, సంస్కృతం, హిందీ, ఆంగ్లం, అరబిక్ భాషల్లో ఆయన నిష్ణాతులు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత నాటి హైదరాబాద్ రాష్ట్రంలో ట్రెజరీ విభాగంలో పైడిమర్రి ప్రభుత్వోద్యోగం సంపాదించారు.

ఆ తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఖమ్మం, నిజామాబాద్, నెల్లూరు, విశాఖపట్నం, నల్లగొండ జిల్లాల్లో సేవలందించారు. 1962లో భారత్ యుద్ధం జరుగుతున్న సమయమది. ఆ సమయంలో విశాఖపట్నం ట్రెజరీ అధికారిగా పైడిమర్ని ఉన్నారు. ఈ యుద్ధం ముగిసిన తర్వాత చైనా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్నది. తమ దేశ ప్రజల్లో ప్రాథమిక దశ నుంచే దేశభక్తి భావం నూరిపోయాలని సంకల్పించిన చైనా, ఆ మేరకు ప్రత్యేకంగా కొన్ని దేశభక్తి గేయాలను రాయించింది. వాటిని పాఠశాల విద్యార్థులతో చదివించడం మొదలుపెట్టింది.

అప్పటికే విదేశీ భాషల్లో ప్రావీణ్యం ఉన్న పైడిమర్రి ఈ విషయాన్ని గుర్తించారు. మన దేశంలోనూ, ముఖ్యంగా విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి గేయాలుంటే బాగుంటుందని భావించారు. అప్పటికే పలు రచనలు చేసిన అనుభవంతో ఆ ఆలోచనకు రూపమివ్వడానికి సంకల్పించారు. ప్రతిజ్ఞను రచించారు. విశాఖకు చెందిన మిత్రుడు తెన్నేటి విశ్వనాథంతో ఈ విషయమై పైడిమర్రి చర్చించారు. అప్పుడు ఏపీలో కాసు బ్రహ్మానందడ్డి ప్రభుత్వం ఉన్నది. నాటి విద్యాశాఖ మంత్రి పీవీజీ రాజు కూడా సాహితీవేత్త కావడం ఈ సందర్భంగా కలిసొచ్చింది. తేన్నేటి సాయంతో ప్రతిజ్ఞను పీవీజీ రాజు దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిజ్ఞ విలువను, అవసరాన్ని వివరించి ఓ ప్రతిని ఆయనకు అందజేశారు.

1964లో బెంగళూరులో ప్రముఖ న్యాయనిపుణుడు మహ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహామండలి సమావేశం జరిపినప్పుడు జాతీయ ప్రతిజ్ఞగా దీన్ని స్వీకరించారు. తరువాత దీన్ని అన్ని భాషల్లోకి అనువాదం చేయించి, 1965 జనవరి 26 నుంచి దేశమంతటా అమల్లోకి తీసుకొచ్చారు. పైడిమర్రి రాసిన ప్రతిజ్ఞలో కాలానుగుణంగా కొన్ని స్వల్ప మార్పులు జరిగాయి. గ్రాంథికంలో ఉన్న కొన్ని పదాల స్థానంలో వాడుక భాషను వాడారు. ‘భారతదేశం నా మాతృభూమి’ ప్రతిజ్ఞను స్ఫూర్తిగా తీసుకొని ఎల్లవేళలా దేశభక్తిని చాటడమే పైడిమర్రి వెంకటసుబ్బారావుకి మనమిచ్చే నివాళి.

కామిడి సతీష్‌రెడ్డి

9848445134