10 March, 2026 | 10:29 AM

సేవకు సెల్యూట్..

09-03-2026 03:01 AM

అలుగునూరులో మున్సిపల్ కమిషనర్‌కు అరుదైన గౌరవం

కరీంనగర్, మార్చి8(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని అలుగునూరు 8వ డివిజన్లో ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషిస్తూ నగర అభివృద్ధికి కృషి చేస్తున్న మున్సిపల్ కమిషనర్ ఐఏఎస్ ప్రఫుల్ దేశాయ్కు గౌరవంగా స్థానిక ప్రజలు ఒక రోడ్డుకు ఆయన పేరును నామకరణం చేయడం ద్వారా కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక99లో భాగంగా ఆదివారం అలుగునూరులో కొత్త రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మనకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ , 8వ డివిజన్ కార్పొరేటర్ కాల్వ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. అలుగునూరు ప్రాంతంలోని శ్రీ స్వయంభూ లక్ష్మీ గణపతి ఆలయం వరకు నిర్మించనున్న గ్రావెల్ రోడ్డు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ డివిజన్లో రోడ్లు, వీధి దీపాలు, హైమాస్ట్ లైట్లు వంటి మౌలిక సదుపాయాలను సమగ్రంగా కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎనిమిదవ డివిజన్ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తామని, అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అలుగునూరు ప్రాంత అభివృద్ధి కోసం ప్రజలు చాలా రోజుల నుండి రోడ్డు మరియు వీధి దీపాలు లేకుండా ఉన్నారు ప్రజలు చేసిన విజ్ఞప్తిని వెంటనే స్వీకరించి రోడ్డు నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు మరియు వీధి దీపాలు మరియు ఐమాక్స్ లైట్స్ పెట్టించినందుకు కృతజ్ఞతగా స్థానిక ప్రజలు, నాయకులు కలిసి ఈ రోడ్డుకు ‘ప్రఫుల్ దేశాయ్ మార్గ్’గా నామకరణం చేశారు. నగర ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న ఐఏఎస్ అధికి గౌరవంగా రోడ్డుకు ఆయన పేరు పెట్టడం అరుదైన ఘటనగా నిలిచింది. ప్రజా సేవలో అంకితభావంతో పనిచేసే అధికారులను గౌరవించే కొత్త సంప్రదాయానికి ఇది నాంది పలికిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.