06-01-2026 12:00:00 AM
మునుగోడు, జనవరి 5 (విజయక్రాంతి) : గ్రామాన్ని అభివృద్ధి చేయకుండా రెండు కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ పలివెల మాజీ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేయాలని కోరుతూ పలివెల నూతన పాలకవర్గం సోమవారం జిల్లా పంచాయతీ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా.. ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా అభివృద్ధి పేరుతో నిధులను దుర్వినియోగానికి పాల్పడ్డ మాజీ సర్పంచ్ గజ్జల బాలరాజ్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి మానసపై పూర్తి విచారణ చేపట్టి నిధులను రికవరీ చేయాలన్నారు.
గ్రామంలో నకిలీ బిల్లులతో ఇంటి పన్ను, నల్లా బిల్లులు ప్రజల నుండి వసూలు చేసిన పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం నుంచి తొలగించాలన్నారు. లేని పక్షంలో త్వరలోనే గ్రామపంచాయతీ, మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో ఉప సర్పంచ్ చెరుకు సునీత సైదులు, వార్డు మెంబర్లు బత్తుల వెంకన్న, ఆనగంటి కృష్ణ ,బత్తుల ప్రవీణ్ ,గోసు కొండ మల్లేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బాసరాజు, యాదగిరి, సొల్లేటి నరసింహ చారి, కొండూరి మల్లికార్జున్, వరికుప్పల, శంకర్ చెరుపల్లి రాము ఉన్నారు.
2020లో అవినీతికి పాల్పడ్డట్టు కలెక్టర్‌కు గజ్జల బాలరాజుపై ఫిర్యాదు..
2020లో కూడా అప్పటికే 8 సంవత్సరాల క్రితం అభివృద్ధి కమిటీ నిర్మించిన వాటర్ ట్యాంక్ ను ఆయన హయాంలో నిర్మించినట్లు చూపిస్తూ అక్రమంగా బిల్లులు పొందినట్లు సర్పంచ్ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని ఆనాటి ఉప సర్పంచ్ బి భాస్కర్ రెడ్డి వార్డు సభ్యులు తో కలిసి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో వార్డు మెంబర్లకు తెలియకుండా వారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఎంబిలను రికార్డు చేసి సుమారు ఒక లక్షల 50వేల రూపాయల నిధులను డ్రా చేసి అవినీతి అక్రమాలకు పాల్పడిన సర్పంచ్ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని నాడే కలెక్టర్ కు పిర్యాదు చేయడం గమనార్హం.