06-01-2026 12:00:00 AM
ఎల్బీనగర్, జనవరి 5: రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం వాహనదారుల్లో ఓపిక, సహనం కోల్పోవడంతోనే అని, ఒక్క నిమిషం ఓపికతో జాగ్రత్తగా ఉంటే ఎంత పెద్ద ప్రమాదమైనా నివారించవచ్చని ఎల్బీనగర్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డి అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా సోమవారం హయత్ నగర్ ఆర్టీసీ డిపో -1 లో రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయని, ప్రమాదాలన్నీ కేవలం డ్రైవర్ల అజాగ్రత్తతోనే అని, సెల్ ఫోన్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, మీతిమీరిన వేగం, ఎదుటి వాహనాలను ఓవ ర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక నిమిషం అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలు జరుగవన్నారు. వనస్థలిపురం ట్రాఫిక్ సీఐ గట్టుమల్లు మాట్లాడుతూ... డ్రైవింగ్ సమయం లో సెల్ ఫోన్ వాడడం మానేయాలన్నారు. యూ టర్నింగ్, బ్లాక్ స్పాట్ పాయింట్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని, మద్యపానం చేసి డ్రైవింగ్ చేయవద్దు అని సూచించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ విజయ్, సహాయ మేనేజర్లు పాల్గొన్నారు.
బండ్లగూడ గేటెడ్ కమ్యూనిటీలో...
నాగోల్ డివిజన్‌లోని బండ్లగూడ గేటెడ్ కమ్యూనిటీ, రాజీవ్ సహభవనంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ రూల్స్, ప్రమాదాల నివారణ చర్యలను పోలీసులు, మోటార్ వెహికల్ అధికారులు వివరించారు. కార్యక్రమంలో ఎంవీఐ అనిత, అధికారులు వేణు, ప్రసాద్, అభిలాష్, కాలనీ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షురాలు సంధ్యా రాణి, సభ్యులు పాల్గొన్నారు.