30 March, 2026 | 3:49 AM

రాచకొండలో రిజర్వాయర్ ఏర్పాటుచేయాలి

30-03-2026 02:16 AM

శివన్నగూడెం ప్రాజెక్టు నుండి లిఫ్ట్ ద్వారా నీరందించాలి

పార్టీలకు అతీతంగా ధర్నాను విజయవంతం చేయాలి

సీపీఐ నాయకులు

సంస్థాన్ నారాయణపూర్, మార్చి 29: సంస్థాన్ నారాయణపురం మండలంలోని గ్రామాల రైతులకు సాగునీరు రావాలంటే రాచకొండలో రిజర్వాయర్ ఏర్పాటు చేయడం ఒక్కటే మార్గమని సీపీఐ కార్యవర్గ సభ్యులు బచ్చనగోని గాలయ్య అన్నారు.సాగునీటి సాధన కోసం నేడు నారాయణపురం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో మహాధర్నా తలపెట్టారు. నారాయణపురం మండల వ్యాప్తంగా గత రెండు రోజులుగా సీపీఐ జాత నిర్వహిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు.

లిఫ్టుల ద్వారా శివన్నగూడెం ప్రాజెక్టు నుండి రాచకొండ రిజర్వాయర్ కు నీళ్లు తీసుకొచ్చి తద్వారా చెరువులకు సరఫరా చేయడం ద్వారా నారాయణపురం మండల సస్యశ్యామలం అవుతుందని లేకపోతే ఎడారిగా మిగిలిపోతుందని తెలిపారు.ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వానికి ఇక్కడి రైతుల బాధలను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రిజర్వాయర్ ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని అన్నారు.

ఉద్యమాల ద్వారానే హక్కులను సాధించుకో వడం సాధ్యమంటూ నేడు తలపెట్టే మహా ధర్నాకు రైతులంతా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్మికులు, రైతుల పక్షాన ఎర్రజెండా ఎప్పటికీ ముందుండి కోట్లాడుతుందని పార్టీలకు అతీతంగా రైతులు నాయకులు ధర్నాకు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కురిమిద్దే శ్రీనివాస్,మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, జిల్లా సమితి సభ్యులు చిలువేరు అంజయ్య, కలకండ సంజీవ,పల్లె మల్లారెడ్డి,సింగపంగ రమేష్,ఎర్రోళ్ల లింగస్వామి, గడ్డం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.