calender_icon.png 21 January, 2026 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడు గంటల సిట్ విచారణ

21-01-2026 12:44:06 AM

  1. హరీశ్‌కు దర్యాప్తు అధికారుల ప్రశ్నల వర్షం
  2. పోలీస్‌స్టేషన్ ఎదుట బీఆర్‌ఎస్ శ్రేణుల ఆందోళన
  3. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్
  4. కుంభకోణాలు బయటపెట్టినందుకే కక్షసాధింపు
  5. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 20 (విజయక్రాంతి): రాష్ర్టంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ రాజకీయంగా మలుపు తిరిగింది. ఈ కేసులో బీఆర్‌ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మంగళవారం సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్లో దాదాపు ఏడు గంటల పాటు సాగిన ఈ విచారణ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.

ఒకవైపు లోపల అధికారుల ప్రశ్నల వర్షం, మరోవైపు బయట బీఆర్‌ఎస్ శ్రేణుల ఆందోళనలతో జూబ్లీహిల్స్ ప్రాంతం దద్దరిల్లింది. విచారణ అనంతరం నేరుగా తెలంగాణ భవన్‌కు వెళ్లిన హరీశ్ రావు.. సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ఏడు గంటలు.. 50 ప్రశ్నలు

ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న హరీశ్‌రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి నేతృత్వంలోని బృందం విచారణలో పాల్గొంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన పోలీస్ అధికారుల వాంగ్మూలాల ఆధారంగా హరీశ్‌రావును 50 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన పాత్ర, ఇంటెలిజెన్స్ అధికారులతో ఉన్న సంబంధాలు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయనే అంశాలపై కూలంకషంగా ఆరా తీసినట్లు తెలిసింది.

హరీశ్‌రావు వెంట వచ్చిన లీగల్ టీమ్ను పోలీసులు లోపలికి అనుమతించలేదు. హరీశ్‌రావు విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావర ణం నెలకొంది. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకుని ప్రభుత్వా నికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. పరి స్థితిని అదుపు చేసేందుకు పోలీసులు పలువురు బీఆర్‌ఎస్ మహిళా నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు.